హైదరాబాద్ : ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు రాజుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే, మంత్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. తాజాగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరిని ఏకి పారేశారు. దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవిలో ఇమడ లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేయాలని అంతే కానీ ప్రశాంతంగా ఉన్న పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు కొండా సురేఖ.
కడియం శ్రీహరి వచ్చాకే కాంగ్రెస్ పార్టీలో వివాదాలు మొదలయ్యాయంటూ బాంబు పేల్చారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, సాధారణ ఎమ్మెల్యే పదవిలో ఉండలేక పోతున్నాడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే, దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకుంటే బెటర్ అంటూ హితవు పలికారు కొండా సురేఖ. కడియం శ్రీహరికి అంత నిజాయితీ ఉంటే రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి చూపించాలంటూ సవాల్ విసిరారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిర్వాకంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశానని, 14వ తేదీన మీనాక్షి నటరాజన్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తానని సంచలన ప్రకటన చేశారు కొండా సురేఖ.
