క‌ల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు

ఘ‌నంగా స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి : నారాయణ వనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. నిన్న‌ రాత్రి 7 గంట‌లకు క‌ల్కి అలంకారంలో అశ్వ వాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు . వాహనం ముందు భక్తజన బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చిన భక్త బాంధ‌వులు.

ఇదిలా ఉండగా ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియ జేసింది. స్వామి అశ్వ వాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలి దోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు. ఇక ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. చేసిన ఏర్పాట్ల ప‌ట్ల భ‌క్తులు సంతృప్తిని వ్య‌క్తం చేశారు.

వాహన సేవలో ఆల‌య డెప్యూటీ ఈవో నాగరత్న, సూప‌రింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు నాగరాజు, చెంగల్ రాయులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!