కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల ఆధారంగా క్రీడా విభాగాలు గుర్తింపు

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ ప్ర‌భుత్వ స్పోర్ట్స్ కార్య‌ద‌ర్శి

అమ‌రావ‌తి : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగానే 65 క్రీడా విభాగాలకు గుర్తించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు ఏపీ స్పోర్ట్స్ ముఖ్య కార్య‌ద‌ర్శి అజ‌య్ జైన్. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో గుర్తించిన 65 క్రీడా విభాగాలు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా నిర్ణయించినవి కాదని, భారత ప్రభుత్వ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు , పెన్షన్ల మంత్రిత్వ శాఖ 2024 మార్చి 4న జారీ చేసిన అధికారిక మార్గదర్శకాల ప్రకారమే గుర్తించ బడినవని తెలిపారు. ఈ క్రీడా విభాగాలను Category-A, Category-Bగా విభజించి, ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల ఎంపిక చేపట్టినట్లు వెల్లడించారు. ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించే ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7 కోట్ల నగదు బహుమతి ప్రకటించిందని తెలిపారు. గతంలో రూ.70 లక్షలుగా ఉన్న ప్రోత్సాహకాన్ని భారీగా పెంచడం ద్వారా క్రీడాకారుల్లో నూతన ఉత్సాహం నింపామని పేర్కొన్నారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, నేషనల్ గేమ్స్, ఖేలో ఇండియా, యూనివర్సిటీ గేమ్స్, జోనల్ పోటీలు, రాష్ట్ర స్థాయి పోటీల వరకు మొత్తం 96 ప్రాధాన్యత కేటగిరీలను ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించిందన్నారు.

ధ్రువపత్రాల పరిశీలనను పూర్తిస్థాయి పారదర్శక విధానంలో నిర్వహించాం . డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలలో ధ్రువపత్రాల పరిశీలనను పూర్తి స్థాయి పారదర్శక విధానంలో నిర్వహించినట్లు తెలిపారు. జి.ఓ.ఎం.ఎస్. నెం.4 ప్రకారం శాప్ ఆరు స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసి, అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సమర్పించిన క్రీడా ధ్రువపత్రాలను పరిశీలించినట్లు వెల్లడించారు. అనంతరం 2025 ఆగస్టు 2, 3 తేదీల్లో విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలో ఒరిజినల్ ధ్రువపత్రాల భౌతిక పరిశీలన నిర్వహించామని తెలిపారు. తదుపరి సంబంధిత క్రీడా ఫెడరేషన్లు, రాష్ట్ర క్రీడా సంఘాలు, యూనివర్సిటీల ద్వారా ధ్రువపత్రాల నిజానిజాలను నిర్ధారించామని చెప్పారు.

అదేవిధంగా విద్యాశాఖ తరఫున 15 మంది అధికారులను నియమించి అభ్యర్థుల విద్యార్హతల ధ్రువపత్రాలను కూడా పరిశీలించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ధ్రువపత్రాలు, సంబంధిత సంస్థల నుంచి పొందిన ధృవీకరణల ఆధారంగానే తాత్కాలిక ప్రాధాన్యత జాబితాను రూపొందించిన‌ట్లు తెలిపారు. 2025 ఆగస్టు 8 నుంచి 14 వరకు శాప్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించి అభ్యంతరాలను స్వీకరించినట్లు పేర్కొన్నారు.. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించిన అనంతరం తుది ప్రాధాన్యత జాబితాను సిద్ధం చేసి, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కమిటీ 2025 ఆగస్టు 20న ఆమోదం తెలిపిందన్నారు. అనంతరం ఆ జాబితాను 421 స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ కోసం 2025 ఆగస్టు 21న విద్యాశాఖకు పంపించినట్లు వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణ నుంచి ధ్రువపత్రాల అప్‌లోడ్, పరిశీలన, ధృవీకరణ, ప్రాధాన్యత జాబితా తయారీ వరకు మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించడం ద్వారా పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థను నిర్ధారించడంతో పాటు బాహ్య జోక్యం, అక్రమాలకు అవకాశాన్ని పూర్తిగా నిరోధించినట్లు తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!