హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మహిళా సాధికారత కోసం తమ సర్కార్ ప్రయత్నం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి శిల్పారామం పక్కన ఒక ఎకరం స్థలాన్ని కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఫిక్కీ ఎఫ్ ఎల్ ఓ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంస్థ ప్రతినిధులు సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ , ఇండస్ట్రీ నేపథ్యంలో నిర్వహించబడుతున్న కార్యక్రమాలను వారు వివరించారు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. హైటెక్ సిటీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పక్కన ఫిక్కీ ఎఫ్ఎల్ ఓ కూడా ఉంటే బావుంటుందన్నారు. దీనిని ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతాన్ని ప్రత్యేక ఆకర్షణగా మారుస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో భాగస్వామి కావాలని కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్ 500 కంపెనీలను నెలకొల్పాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, ఫిక్కీ మహిళా పారిశ్రామిక వేత్తల పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందన్నారు.
ఫిక్కీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్క్ విజయవంతమైన నేపథ్యంలో, మహిళా సాధికారత కోసం మరో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయడాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, ప్రతి మూడు నెలలకోసారి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రగతిని సమీక్షిస్తామని తెలిపారు. వ్యాపారంలో రాణిస్తున్న మహిళా సంఘాలను సన్మానించేందుకు ఫిక్కీ ఆధ్వర్యంలో ఏటా అవార్డులు ప్రదానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
