ప‌ర్యాట‌క రంగంపై స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌

స్ప‌ష్టం చేసిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా ఎదిగేందుకు అత్యంత అనువైన ప్రాంతమని, ఆ దిశగా పర్యాటక రంగానికి కొత్త కళ తీసుకురావాలని పర్యాటక, సాంస్కృతిక‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మౌలిక వసతుల కల్పన, గమ్యస్థానాల బ్రాండింగ్, విస్తృత ప్రచార కార్యక్రమాలకు సంబంధించి నిర్దిష్ట కాల పరిమితితో కూడిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన దిశానిర్ధేశం చేశారు. ఈరోజు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిర్వహించిన పర్యాటక సలహా కమిటీ, మండ‌లి సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని వారసత్వ సంపద, సంస్కృతి, అద్భుతమైన కట్టడాలు, ప్ర‌కృతి ర‌మ‌ణీయ ప్ర‌దేశాలు, జ‌ల వ‌న‌రులు, ద‌ట్ట‌మైన అడ‌వులు, ఆధ్యాత్మిక కేంద్రాలను సమన్వయం చేస్తూ తెలంగాణను ఒక శక్తివంతమైన పర్యాటక హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు కనీస సౌకర్యాల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని సూచించారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, తాత్కాలిక వసతి గదులు, టెంట్లు, గ్లాస్ హౌస్‌లతో పాటు రహదారి పక్కన ఉండే విశ్రాంతి సౌకర్యాలను వెంటనే మెరుగు ప‌ర్చాల‌ని, కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. సలహా కమిటీ సమావేశంలో వెల్లడైన ప్రతిపాదనలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని, అమలు ప్రక్రియలో జాప్యం జరగకుండా ఒక నిర్దిష్ట పని లేదా ప్రాజెక్ట్ బాధ్యతను పర్యవేక్షించడానికి నోడల్ అధికారికి అప్ప‌గించాల‌ని అన్నారు.

దేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నవంబరు లేదా డిసెంబరు మాసాల్లో హైదరాబాద్‌లో భారీ స్థాయిలో కార్నివాల్‌ నిర్వహణ‌పై అధ్య‌య‌నం చేయాలని, సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప్రతిపాద‌న‌లు రూపొందించి, స‌మ‌ర్పించాల‌ని మంత్రి చెప్పారు. ప్రారంభంలో ప్రభుత్వమే దీనిని చేపట్టినా, భవిష్యత్తులో ప్రైవేటు భాగస్వామ్యంతో స్వయం సమృద్ధిగా సాగేలా చూడాలని అన్నారు. జీహెహెచ్ఎంసీ, హెచ్ఏండీఏ స‌మ‌న్వ‌యంతో నగర సుందరీకరణలో భాగంగా శిల్పాలు, ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేపింగ్‌, స్కై వాక్ లు సృజనాత్మక ఉట్టిప‌డేలా తీర్చిదిద్దాల‌ని మంత్రి ఉద్భోదించారు. సమావేశంలో ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గౌత‌మి, డైరెక్ట‌ర్ ఆఫ్ టూరిజం – ల‌క్ష్మ‌ణ్ రంజిత్ నాయ‌క్, కమిటీ సభ్యులు పాపారావు , కమలవర్ధన్ రావు , డాక్టర్ బాలాజీ, జుల్ఫీ, మార్గ్ పటేల్, రాందేవ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!