ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌య‌త్నం శివాల‌యం పునర్నిర్మాణం

శిథిలావస్థకు చేరిన ఆలయ పునరుద్ధరణకు హామీ

తిరుమ‌ల : డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చొర‌వ‌తో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణం కానుంది. అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలోని శివాలయం పునరుద్ధరణకు టీటీడీ నిధులు మంజూరు చేసింది. పవన్ కళ్యాణ్ విన్నపం మేరకు రూ. 55 లక్షల నిధులు మంజూరు చేస్తూ టీటీడీ పాలక మండలి ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 14వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంత పర్యటనలో భాగంగా వర్తనపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో రోడ్లు, డ్రెయిన్లు పరిశీలిస్తున్న సమయంలో శివాలయాన్ని సందర్శించాలని స్థానికులు కోరారు. భక్తుల కోరిక మేరకు స్వామి వారి దర్శనానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ శివాలయం శిథిలావస్థకు చేరడాన్ని గమనించారు.

మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయ పునర్నిర్మాణానికి సహకరించాలని ఆ గ్రామస్తులు ఉప ముఖ్యమంత్రిని కోరారు. టీటీడీ సహకారంతో శివాలయం అభివృద్ధికి స‌హ‌క‌రిస్తామ‌ని వర్తనపల్లి వాసులకు హామీ ఇచ్చారు. పర్యటన ముగిసిన వెంటనే వర్తనపల్లి శివాలయం నిర్మాణం కోసం టీటీడీకి లేఖ రాశారు. ఆ ప్రాంత భక్తుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని పునరుద్ధరణ పనులు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. తక్షణం టీటీడీ సాంకేతిక బృందం వర్తనపల్లిలో పర్యటించింది. గ్రామస్తుల అభిమతం మేరకు శివాలయం పునర్నిర్మాణంతో పాటు సింహ వాహనంతో కూడిన అమ్మవారి విగ్రహం, మూషిక వాహనంతో కూడిన గణపతి విగ్రహం, నెమలి వాహనంతో కూడిన సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం, ధ్వజస్తంభం ఏర్పాటుకు అంచనాలు రూపొందించింది.

వీటితోపాటు భక్తులు సేదతీరేందుకు బెంచీలు, బోర్ వెల్ తో కూడిన తాగునీటి సౌకర్యం, మైక్ సిస్టం తదితర సౌకర్యాలు కూడా వర్తనపల్లి శివాలయంలో ఏర్పాటు చేసేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. ఆలయ పునర్నిర్మాణం కోసం సహకారం అందించిన ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు, టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడుకు, పాల‌క మండ‌లి స‌భ్యుల‌కు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!