స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

విశాఖ‌ప‌ట్నం : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మరణించడం, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడటం అత్యంత బాధాకరం అన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కార్మికుని కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున తక్షణ పరిహారంతోపాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్లాంట్లో ఉద్యోగం కల్పిస్తాం అన్నారు. తీవ్రంగా గాయపడి ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. శాశ్వత ఉద్యోగులకు ఉద్యోగ విరమణ ప్రయోజనాల కింద రూ. 1.72 కోట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ. 45.75 లక్షలు అందిస్తామని, క్షతగాత్రుల వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చులను ప్లాంట్ యాజమాన్యమే పూర్తిగా భరిస్తుందని ప్ర‌క‌టించారు. ప్రమాద ఘటనపై బొకారో స్టీల్ ప్లాంట్ కు చెందిన త్రిసభ్య కమిటీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుందని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన, అలాగే తీవ్రంగా గాయపడ్డ ప్రతి ఒక్క కార్మికుడి కుటుంబానికి కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూస్తాం అన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ప్రస్తుతం ఏ విధంగా సాగుతున్నాయో, మరణించిన కార్మికుల పిల్లల చదువులు కూడా అదే విధంగా కొనసాగుతాయని అన్నారు. ప్రమాదంలో మరణించిన ఉద్యోగికి పదవీ విరమణ వయస్సు వచ్చేంత వరకు, వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఉంటున్న స్టీల్ ప్లాంట్ క్వార్టర్లలోనే ఉచితంగా కొనసాగవచ్చు అని తెలిపారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్ బయట అద్దె ఇళ్లలో నివసిస్తున్న బాధిత కుటుంబాలు ఒకవేళ ప్లాంట్ క్వార్టర్లలోకి మారాలని అనుకుంటే, వారికి కూడా టౌన్‌షిప్ లోపల క్వార్టర్లను కేటాయిస్తారని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.. ఒక కోణంలో కాదు.. అన్ని వైపులా వివరాలు సేకరిస్తే విషయం తెలుస్తుంది. ఇలాటి దుర్ఘటనలు జరిగినప్పుడు బాధపడటం కాదు.. పునరావృతం కాకుండా చూడాల‌ని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!