వ‌ర్జీనియా పొగాకు రైతుల‌కు ఏపీ స‌ర్కార్ ఊర‌ట

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి : వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి సమన్వయంతో పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా, కొనుగోళ్లు వేగవంతం అయ్యేలా ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం, పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో నిరంతర సంప్రదింపుల వలన పొగాకు బోర్డు ఈడీ, చైర్మన్ లకు కేంద్ర ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేయటంతో పొగాకు మార్కెట్ పరిస్థితులు, కొనుగోళ్ల పురోగతి, ఎగుమతుల స్థితిగతులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పొగాకు బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో రైతులు, కొనుగోలు సంస్థలతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. రైతులు, కంపెనీల అభిప్రాయాలను సమగ్రంగా పరిశీలించి కొనుగోలు ప్రక్రియను మరింత సమర్థవంతం చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు.

అదే క్రమంలో పొగాకు బోర్డు చైర్మన్ మంగ‌ళ‌వారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అర‌వింద్ శ్రీవాస్త‌వ్ తో పాటు సంబంధిత ఉన్నతాధికారులను కలుసుకుని వర్జీనియా పొగాకు రైతుల పరిస్థితిని వివరించినట్లు చెప్పారు. రైతుల సమస్యలపై సానుకూల దృక్పథంతో స్పందించాలని కోరినట్లు వెల్లడించారు. గత 15 రోజుల క్రితం మార్కెట్‌లో రోజుకు సుమారు 150 బేళ్ల స్థాయిలో మాత్రమే కొనుగోళ్లు జరిగేవని, ప్రభుత్వం తీసుకున్న చర్యలు, రైతులు, కంపెనీల మధ్య సమన్వయంతో ప్రస్తుతం ఇది సగటుగా 700 బేళ్లకు పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ ధోరణి కొనసాగితే వచ్చే వారం రోజుల్లో రోజుకు 1000 నుంచి 1200 బేళ్ల వరకు కొనుగోళ్లు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కంపెనీలు అవసరమైన గ్రేడ్ల వివరాలను సమావేశంలో తెలియజేశాయని, వాటి ఆధారంగా వారంవారీ కొనుగోలు లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిపారు. రైతులు అన్ని గ్రేడ్లను సమానంగా మార్కెట్‌కు తీసుకు రావాలని సూచించారు. అన్ని గ్రేడ్ల సమగ్ర ప్రవాహం ఉంటే కొనుగోళ్లు మరింత సాఫీగా జరుగుతాయని స్పష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!