హైదరాబాద్: తెలుగు సిల్వర్ స్క్రీన్‌పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరో హీరోయిన్లుగా రమేష్ చెరుకూరు దర్శకత్వంలో సావిత్రమ్మ నిర్మాణంలో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వి. సాంబశివరావు, వేణు గోపాల చారి సారధ్యం లో తెరకెక్కుతున్న చిత్రం ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’. ప్రముఖ సినీ దర్శకులు, నిర్మాతలు, నటుల సమక్షంలో ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ చిత్ర టీజర్, ట్రైలర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ప్రసాద్ ల్యాబ్‌లోజరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, దామోదర ప్రసాద్, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, దర్శకులు వి. సముద్ర, రామ్ ప్రసాద్, నటుడు-నిర్మాత అశోక్ కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, రాజేందర్ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ డైలాగ్‌లో వచ్చిన ‘సిద్ధు.. సిద్ధార్థ్ రాయ్’ ఎంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో, అదే విధంగా ఈ సినిమా కూడా ప్రేక్షకులకు బాగా చేరువ అవుతుందని నమ్ముతున్నానని అన్నారు. డల్లాస్ నుంచి వచ్చి ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రమేష్ భవిష్యత్తులో మరెన్నో మంచి సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను అన్నారు.
తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన సినీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. రమేష్ నన్ను సంప్రదించినప్పుడు ఆయనలో ఉన్న సినిమా పట్ల అభిరుచి, పట్టుదల నాకు అర్థమైంది. అందుకే ఆయనకు పూర్తి సహకారం అందించాను. మా దర్శకుల సంఘ సభ్యుల సినిమాల విడుదలకు సహకరించాలని మేము నిర్ణయించుకున్నాం.
ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ గత పదేళ్లుగా ఎంతో మంది ఎన్ఆర్ఐలు సినీ పరిశ్రమలోకి వస్తున్నారు. అలాంటి వారిలో రమేష్ కూడా ఒకరు. మంచి కథతో తీసిన ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అన్నారు. దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ ఇలాంటి మంచి ప్రయత్నాలు తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందాలి. నిర్మాత ఇంకా ఎన్నో సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉదని అన్నారు.
ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ కొత్తవారితో మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం అభినందనీయం. టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. చిత్ర యూనిట్ అంతా ఎంతో కష్టపడి పని చేసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ, “‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ ట్రైలర్ చాలా బాగుంది. ప్రేమకథకు వినోదం, భావోద్వేగాలు జోడించినట్లు కనిపిస్తోంది. చిత్ర యూనిట్ అందరికీ నా అభినందనలు. సినిమా మంచి విజయాన్ని సాధించి నిర్మాతకు, దర్శకుడికి మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.