తిరుపతి : కలియుగంలో భక్తుల కోరికలను కరుణతో తీర్చే సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహంతో భక్తులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక ప్రశాంతత కలగాలని సంకల్పిస్తూ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్యం ఆర్జిత సేవలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర విధానాల ప్రకారం జరుగుతున్న ఈ సేవల్లో దేశ విదేశాల నుండి వేలాదిమంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులవుతున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిత్య, వారాంత, నెలవారీ, వార్షిక, శాశ్వత ఆర్జిత సేవలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అమ్మవారికి సమర్పించే ప్రతి సేవ భక్తులలో భక్తి భావనను పెంపొందించడంతో పాటు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రతిరోజూ ఉదయం 4.30 గంటలకు సుప్రభాత సేవ నిర్వహిస్తారు. శుక్రవారం మాత్రం ఉదయం 3.30 గంటలకు ఈ సేవ జరుగుతుంది . ఉదయం 5 గంటలకు సహస్ర నామార్చన నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం 4 గంటలకు ఈ సేవ ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు కుంకుమార్చన సేవ నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు సహస్ర దీపాలంకార సేవ జరుగుతుంది.
ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. శుక్రవారం మాత్రం రాత్రి 9.45 గంటలకు ఈ సేవ ఉంటుంది. ఆలయంలోని వేదాశీర్వచన మండపంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వేదాశీర్వచనం కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వి.ఐ.పి. బ్రేక్ దర్శనం ఉంటుంది. ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ నిర్వహిస్తారు. ప్రతి గురువారం ఉదయం 7 గంటలకు తిరుప్పావడ సేవ జరుగుతుంది ప్రతి శుక్రవారం ఉదయం 5.30 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అనంతరం అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 7 గంటలకు అభిషేకానంతర దర్శనం కల్పిస్తారు. అదే రోజు ఉదయం 9.30 గంటలకు లక్ష్మీపూజ నిర్వహిస్తారు . ప్రతి శనివారం ఉదయం 7.30 గంటలకు పుష్పాంజలి సేవ జరుగుతుంది. ప్రతి నెల మొదటి బుధవారం ఉదయం 7 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మే నెలలో వార్షిక వసంతోత్సవాలు, సెప్టెంబర్ నెలలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. నవంబర్ నెలలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ రోజున లక్ష కుంకుమార్చన, మరుసటి రోజు పుష్పయాగం వైభవంగా జరుగుతాయి. శాశ్వత సేవలలో భాగంగా నిత్య అర్చన, ఊంజల్ సేవలను భక్తులు కోరిన రోజున నిర్వహించి ఇద్దరికి దర్శన భాగ్యం కల్పిస్తారు.
అదే విధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం ఉదయం, అలాగే శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతి ఆదివారం ఉదయం అభిషేక సేవలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevesthanams.ap.gov.in లో ఆన్లైన్ బుకింగ్ ద్వారా కూడా సేవా టికెట్లు పొందవచ్చు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో, సేవ సమయానికి ముందుగానే ఆలయానికి చేరుకొని టీటీడీ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. (Courtuussy TTD)
