తిరుమ‌ల‌లో ఎల‌క్రిక్ బ‌స్సుల సంఖ్య 50కి పెంపు

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన టీటీడీ ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌

తిరుపతి : టీటీడీ ఈవో ముద్దాడ ర‌విచంద్ర కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లో తిరుమ‌ల‌లో ఘ‌నంగా బ్రహ్మోత్స‌వాలు నిర్వ‌హంచ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఉత్స‌వాల‌కు ముందు టీటీడీ తన ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను 15 నుండి 50కి పెంచనుందని వెల్ల‌డించారు. ఇందులో రిలయన్స్ సంస్థ విరాళంగా ఇస్తున్న 25 ఈ-బస్సులు ఉన్నాయని తెలిపారు ఈవో. మిగిలిన అదనపు బస్సులను ఆలయ యంత్రాంగం సమకూర్చుకోనుందని పేర్కొన్నారు. భక్తులకు పర్యావరణ అనుకూల రవాణా సదుపాయాలను బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా, సెప్టెంబర్‌లో జరగనున్న వార్షిక శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందే తిరుమల కొండపై తమ ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను 15 నుండి 50కి పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానాలు యోచిస్తోంది.

ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ సరఫరా, డ్రైవర్ల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల అవసరాలపై చర్చించేందుకు టీటీడీ అదనపు ఈవో చ. వెంకయ్య చౌదరి తిరుమలలో రిలయన్స్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. బ్రహ్మోత్సవాల నాటికి ఎలక్ట్రిక్ బస్సులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు ఈవో అధికారులను ఆదేశించారు. తిరుమలలో భక్తులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు ఈ బస్సులను సమర్థవంతంగా వినియోగించాలని ఆయన సూచించారు. 50 ఈ-బస్సులకు సరిపడా సామర్థ్యం కలిగిన ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని టీటీడీ ప్రతిపాదించింది.

ఈ కేంద్రంలో 10 ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి, తద్వారా ఒకేసారి 20 బస్సులను ఛార్జ్ చేసే వీలుంటుంది. 2 మెగావాట్ల (MW) సామర్థ్యం గల ఈ ఛార్జింగ్ వ్యవస్థ వాహనాలు వేగంగా ఛార్జ్ అయ్యేలా చూస్తుంది. ఒక్కో బస్సు 50 మంది ప్రయాణికులను తీసుకువెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ బస్సులను నడపడానికి 50 మంది శిక్షణ పొందిన డ్రైవర్లను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు బస్సు సేవలు ఉచితంగా ఉంటాయి. బస్సులు రెండు షిఫ్టులలో నడప బడతాయి, ఒక్కో షిఫ్టులో 25 బస్సులు ఉంటాయి. ప్రతి రెండు నిమిషాలకు భక్తులకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.

ఛార్జింగ్ మౌలిక సదుపాయాల పనులను త్వరగా పూర్తి చేసేందుకు అనువైన పార్కింగ్ స్థలాన్ని గుర్తించి, రిలయన్స్ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. రాబోయే బస్సు స్టాప్‌ల వివరాలను ప్రయాణికులకు తెలియజేసేందుకు బస్సుల్లో ‘ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్’ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!