హస్త కళాకారుల అభివృద్ధే కూటమి లక్ష్యం

రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

విజయవాడ : రాష్ట్రంలో హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర చేనేత, హస్తకళల అభివృద్ధి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ, లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలోవిజయవాడలోని డా. బి.ఆర్. అంబేద్కర్ కళా వేదికలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం–2026 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రతి స్టాల్‌ను సందర్శించి కళాకారుల సమస్యలను తెలుసుకోవడం వారికి కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. బొబ్బిలి వీణల తయారీదారులు ఎదుర్కొంటున్న కలప కొరతను తీర్చేందుకు రానున్న ఆగస్టు 15 నాటికి వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లేపాక్షి ఆధ్వర్యంలో కళాకారుల ఉత్పత్తుల విక్రయాల కోసం తరంగ యాప్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

దేశవ్యాప్తంగా హస్తకళలకు ప్రకటించిన 30 జాతీయ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అత్యధికంగా 10 అవార్డులు దక్కడం రాష్ట్రానికి గర్వ కారణమన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ ప్రాజెక్ట్, నగరవనాలు ఏర్పాటు చేస్తూ పచ్చదనం పెంపొందిస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద రికార్డు స్థాయిలో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు గోకులం షెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం వేగంగా కొనసాగుతోందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలను అమలు చేస్తూ హస్తకళాకారులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!