ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్

అమ‌రావ‌తి : ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేస్తామంటూ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ . ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు. విజ‌య‌వాడ‌లో నాదెండ్ల మ‌నోహ‌ర్ న్యాయపరమైన అడ్డంకులను పరిష్కరించడం, కోర్టు ఆదేశాల ద్వారా కంపెనీ ఆస్తులను వేలం వేయడం , పెట్టుబడిదారులకు డబ్బు తిరిగి చెల్లించడం ద్వారా అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు పూర్తి న్యాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు నెలల గడువును నిర్దేశించిందని చెప్పారు. సచివాలయంలో అగ్రిగోల్డ్ అంశంపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు.

అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి హోం మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరుకాగా, ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారని తెలిపారు. కేసు ప్రస్తుత స్థితి, ప్రతిపాదిత ఆస్తుల వేలం, ఇప్పటికే చెల్లించిన పరిహారం , మిగిలిన క్లెయిమ్‌ల పరిష్కారానికి సంబంధించిన ప్రణాళికపై అధికారులు సమగ్ర వివరాలను అందించారని వెల్ల‌డించారు.

11.57 లక్షల మంది డిపాజిటర్లు (వీరిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు) పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారని, రాష్ట్రంలో చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ. 3,944 కోట్లుగా అంచనా వేయబడిందని తెలిపారు. ఏజెంట్ల వద్ద సుమారు రూ. 2,000 కోట్ల విలువైన బాండ్లు ఉన్నట్లు సిఐడి దర్యాప్తులో తేలిందని, వాటిని 30 రోజుల్లోగా స్వాధీనం చేసుకుంటామని ఆయన చెప్పారు. ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 23,599 ఎకరాల అగ్రిగోల్డ్ భూములను ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఆక్రమణలను నివారించడానికి ఈ ఆస్తులకు జియో-ట్యాగింగ్ చేసి, కోర్టు పర్యవేక్షణలో జరిగే వేలం కోసం భద్రపరుస్తారు. ప్రతి నిజమైన డిపాజిటర్‌కు వీలైనంత త్వరగా పరిహారం అందేలా చూసేందుకు మంత్రుల ఉపసంఘం ప్రతి 15 రోజులకు ఒకసారి పురోగతిని సమీక్షిస్తుందని మనోహర్ తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!