ఆప్తుడిని, ఉద్య‌మ‌ స‌హ‌చ‌రుడిని కోల్పోయా : కేసీఆర్

తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్నీ వ్యక్తం చేసిన పార్టీ అధినేత

హైద‌రాబాద్ : వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి అర్ద‌రాత్రి సికింద్రాబాద్ లోని య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయ‌న మృతి ప‌ట్ల పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు శుక్ర‌వారం తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. తానొక ఆప్త మిత్రున్ని , ఉధ్యమ సహచరున్ని కోల్పోయానని తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. త‌ను లేని లోటు పూడ్చ లేనిద‌ని, ఇది పార్టీకి తీర‌ని న‌ష్ట‌మ‌ని పేర్కొన్నారు మాజీ సీఎం. కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు, పెద్ది అభిమానులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా వుంటుందన్నారు. ఈ విషాద స‌మ‌యంలో కార్య‌క‌ర్త‌లు ధైర్యంగా ఉండాల‌ని సూచించారు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో, వరంగల్లు జిల్లా ఉద్యమంలో, తనతోపాటు కలిసి నడిచిన జ్జాపకాలను కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పెద్దిని బతికించు కోవడానికి పార్టీ చేసిన విశ్వప్రయత్నాలు, డాక్టర్లు చేసిన కృషీ విఫలం కావడం పట్ల కేసీఆర్ మనోవేదనను వ్యక్తం చేశారు.
తెలంగాణ నే శ్వాసగా, నీతి నిజాయితీతో ప్రజా జీవనం కొసాగిస్తూ సాగించిన రాజకీయ ప్రస్థానం ఆదర్శ ప్రాయమన్నారు. పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ కొనియాడారు. ఉద్యమకాలం నుంచి చివరిశ్వాస వరకూ గులాబీ జెండా నీడలో, పార్టీ అడుగుజాడల్లో నడిచిన పెద్ది, అటు పోరాటంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడని పేర్కొన్నారు.

పార్టీ పట్ల అత్యంత విధేయతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు కూడా లొంగని పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ పటిమ, ధైర్య సాహసాలు, స్ఫూర్తి, ఆయన చేసిన సేవలు నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవే సుకుంటాయని అన్నారు .పెద్దిని కోల్పోయి శోక తప్త హృదయులైవున్న భార్యా పిల్లలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాల‌ని ఆ భ‌గ‌వంతుడిని కోరుకున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!