హిజాబ్‌పై హైకోర్టు ఉత్తర్వులపై ఓవైసీ సీరియ‌స్

ఇది పూర్తిగా ఇస్లాంపై దాడి త‌ప్ప మ‌రోటి కాదు

హైద‌రాబాద్ : ఎంఐఎం పార్టీ చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాఠశాలల్లో హిజాబ్ ధ‌రించ‌డంపై అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఉత్త‌ర్వుల గురించి ప్రస్తావించారు. ఈ తీర్పును ఇస్లాంపై దాడి”గా ఒవైసీ అభివర్ణించారు. ప్రయాగ్‌రాజ్‌లోని ఒక పాఠశాలకు చెందిన మైనర్ విద్యార్థిని నిర్దేశిత యూనిఫాంతో పాటు హిజాబ్ ధరించేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టి వేసింది. ఈ ఉత్తర్వులను అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా విమర్శించారు. దారుస్సలాంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘జల్సా-ఎ-రహ్మతుల్-లిల్-ఆలమీన్’ సభలో ప్రసంగించారు. మతపరమైన ఆచరణలో ఏది ‘అత్యవసరం’ అనే అంశంపై సుప్రీంకోర్టులో శబరిమల కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు, హైకోర్టు ఇలాంటి ఉత్తర్వును ఇచ్చి ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

అలహాబాద్ హైకోర్టు నుండి ఒక తీర్పు వచ్చింది. ఒక బాలిక పాఠశాలకు హిజాబ్ ధరించి వెళ్తుండగా, హిజాబ్ ధరించ కూడదని కోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుతో నేను విభేదిస్తున్నాను; నేను దానిని అంగీకరించను. శబరిమల కేసు ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉంది, అక్కడ తొమ్మిది మంది న్యాయమూర్తులు ఏది అత్యవసరమో నిర్ణయిస్తున్నారు అని ఆయన అన్నారు. నేటి తీర్పు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25 , 19లను ఉల్లంఘిస్తోంది. ఇస్లాంకు ఏది అత్యవసరమో నిర్ణయించడానికి మీరెవరు? బాలికలు హిజాబ్‌ను తమ తలలపై ధరిస్తున్నారు, మనస్సులపై కాదు. ఇది ఇస్లాంపై క‌చ్చితంగా జ‌రిగిన దాడిగా ఆయ‌న పేర్కొన్నారు. స్కార్ఫ్ ధరించడం తన మతంలో ఒక “అత్యవసర” భాగమని, అది లేకపోతే తన విశ్వాసం దెబ్బ తింటుందని నిరూపించడానికి పిటిషనర్ ఎటువంటి మత గ్రంథాలను లేదా ఆధారాలను సమర్పించ లేదని అలహాబాద్ హైకోర్టు గమనించింది.

Leave A Reply

Your Email Id will not be published!