20 మంది టీఎంసీ ఎంపీల‌కు స్పీక‌ర్ నోటీసులు

అన‌ర్హ‌త పిటిష‌న్ల నిర్ణ‌యంలో జాప్యంపై ఆరా

న్యూఢిల్లీ : లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా అనర్హత పిటిషన్లపై దాఖ‌లైన పిటిష‌న్ల‌పై స్పందించారు. ఈ మేర‌కు 20 మంది రెబల్ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలకు స్పీక‌ర్ నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్ల నిర్ణయంలో జాప్యంపై ఎంపీ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ఏడు రోజుల్లోగా స్పందన తెలియ జేయాలని ఓం బిర్లా కోరారు. ప్రస్తుతం ఎన్ సీపీఐ లో ఉన్న 20 మంది రెబల్ టీఎంసీ ఎంపీల అనర్హత పిటిషన్లపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ అభిషేక్ బెనర్జీ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచారించిన కోర్టు త‌క్ష‌ణ‌మే స‌మాధానం చెప్పాల‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో నోటీసులు జారీ చేయ‌క త‌ప్ప‌లేదు స్పీక‌ర్ కు. ఈ నోటీసుల్లో ఆయా ఎంపీలు 7 రోజుల్లో స‌మాధానం ఇవ్వాల‌ని ఆదేశించారు.

అంతకు ముందు తమ అనర్హతను కోరుతూ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యాన్ని సవాలు చేస్తూ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆ 20 మంది రెబల్ ఎంపీల స్పందనను కోరింది. తన వద్ద పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా లోక్‌సభ స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై, న్యాయమూర్తులు సూర్య కాంత్, జాయ్‌మాల్య బాగ్చీ , వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఆ 20 మంది ఎంపీలకు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ స్పీకర్ , స‌భ‌ సెక్రటరీ జనరల్ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం టీఎంసీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికే ఆ 20 మంది ఎంపీలకు నోటీసులు జారీ చేశారని ధర్మాసనానికి తెలిపారు.

దీనిపై స్పందిస్తూ జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ ఇది కేవలం నోటీసులు జారీ చేసే విషయం కాదు. నిర్ణీత కాల పరిమితి లోగా ప్రక్రియను పూర్తి చేసే విషయం అని అన్నారు. ఆ 20 మంది ఎంపీలు పార్టీని వదిలి, ఆ తర్వాత నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారని టీఎంసీ ఆరోపించింది.

Leave A Reply

Your Email Id will not be published!