బీజేపీలో అగ్ర‌వ‌ర్గాల‌దే ఆధిప‌త్యం ..?

నితిన్‌ నబీన్‌ బృందంలోనూ అదే తీరు

న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీలో అధ్య‌క్షుడు మారినా , ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ బీసీగా ఉన్న‌ప్ప‌టికీ అగ్ర‌వ‌ర్ణాలకే ప్రాధాన్య‌త ద‌క్కుతోంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఒకప్పుడు బీజేపీ బ్రాహ్మణ మద్దతు కలిగిన పార్టీగా ఉండేది. అయితే ఓబీసీ నేత అయిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ పార్టీని వెనుకబడిన కులాలు, దళితులు, ఆదివాసీలు, ఇతర వర్గాలపై పట్టు సాధించి అందరినీ కలుపుకుని పోయే పార్టీగా మార్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వివిధ రాష్ర్టాల్లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలతో పాటు పార్టీ శ్రేణుల్లోని ఉన్నత పదవులు అగ్ర కుల నేతలే ఆక్రమిస్తున్నారు.

ప్ర‌ముఖ డిజిట‌ల్ మీడియా సంస్థ ‘ది ప్రింట్‌’ తాజాగా బీజేపీలో కొన‌సాగుతున్న అగ్ర‌కులాల ఆధిప‌త్యం గురించి విశ్లేష‌ణాత్మ‌క క‌థ‌నం ప్రచురించింది. ఈ విశ్లేషణ ప్రకారం ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు (కాయస్థ వర్గం) నియమించిన నూతన ఆఫీస్‌ బేరర్లలో 50 శాతానికిపైగా అగ్ర కులానికి చెందినవారే ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని 17 మంది ముఖ్యమంత్రుల్లో 10 మంది అగ్రకులాలు లేదా అగ్రవర్గాలకు చెందిన వారు కాగా, ముగ్గురు ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ), ముగ్గురు షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీ) ఒకరు మెయిటీ వర్గానికి చెందిన వారున్నారు.

హిమంత బిశ్వ శర్మ (అస్సాం), రేఖా గుప్తా (ఢిల్లీ) ప్రమోద్‌ సావంత్ (గోవా), భూపేంద్ర పటేల్ (గుజరాత్‌), దేవేంద్ర ఫడ్నవిస్ (మహారాష్ట్ర), భజన్‌లాల్‌ శర్మ (రాజస్థాన్‌), మాణిక్‌ సాహా (త్రిపుర), యోగి ఆదిత్యనాథ్‌( ఉత్తరప్రదేశ్‌) పుష్కర్‌ సింగ్‌ ధామి (ఉత్తరాఖండ్‌), సువేందు అధికారి (పశ్చిమ బెంగాల్‌) అగ్రకులానికి చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. పెమాఖండూ (అరుణాచల్‌ ప్రదేశ్‌), విష్ణదేవ్‌ సాయి (ఛత్తీస్‌గఢ్‌), మోహన్‌ చరణ్‌ మాఝీ (ఒడిశా) ఎస్టీ కేటగిరీకి చెందిన వారు కాగా, సామ్రాట్‌ చౌదరి (బిహార్‌) నాయబ్‌ సింగ్‌ సైనీ( హర్యానా), మోహన్‌ యాదవ్ (మధ్యప్రదేశ్‌) ఓబీసీ వర్గానికి చెందిన వారిని ఎంపిక చేశారు.

బీజేపీ కొత్తగా నియమించిన ఎనిమిది మంది జాతీయ ప్రధాన కార్యదర్శులలో ఆరుగురు అగ్ర కులాలకు చెందినవారే. 13 మంది జాతీయ ఉపాధ్యక్షులలో ఏడుగురు అగ్ర కులాలకు చెందినవారు కాగా, ఇద్దరు ఓబీసీలు, ఒకరు ఎస్టీ, ఒకరు ఎస్పీ, ఒకరు ముస్లిం, మరొకరు సిక్కు వర్గానికి చెందినవారు. కాగా కొత్త బృందం సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు ‘ది ప్రింట్‌’కు తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!