హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం మరింత వేడిని రాజేస్తోంది. సామాన్యంగా అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య పోటీ ఉంటుంది. కానీ ప్రస్తుతం కొలువుతీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రి , సీఎం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ రూ. 200 కోట్లు కొల్లగొట్టారని, అంతులేని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సాక్షాత్తు మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా పటేల్ ఆరోపించారు. అవసరమైతే నిరూపించేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. దీంతో పార్టీలో, ప్రభుత్వంలో కలకలం రేపాయి ఈ కామెంట్స్. దీనిపై తాను ఏమీ జోక్యం చేసుకోనని అంతా హై కమాండ్ చూసుకుంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ తరుణంలో తెలంగాణ నమూనానే దేశవ్యాప్తంగా కులగణనకు ప్రామాణికంగా తీసుకోవాలని ఖర్గే, రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. మరి తెలంగాణలో బీసీ మహిళా మంత్రి కొండా సురేఖను తప్పిస్తారా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్లలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. డీలిమిటేషన్, మహిళా బిల్లు వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఈ సమయంలో, కాంగ్రెస్ ఒక బీసీ మహిళా మంత్రిని తొలగించే అవకాశం ఉందా అనేది చర్చకు దారి తీసేలా చేసింది.
మహిళ సాధికారత అని మాట్లాడే నాయకులు, కొండా సుష్మిత వ్యాఖ్యలకు కొండా సురేఖ తొలిగింపును రేపు ఎలా సమర్థిస్తారు ? కొండా సురేఖ స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే, బర్తరఫ్ చేయాలని గవర్నర్‌కు సిఫార్సు చేస్తారా ..? దేశవ్యాప్తంగా కులగణనపై కాంగ్రెస్ మాట్లాడుతున్న వేళ… తెలంగాణలో ఒక బీసీ మహిళా మంత్రిని ఇంటికి పంపే రిస్క్ చేస్తుందా ? మరో వైపు ఖర్గేతో భేటీ తరువాత కొండా సురేఖ తన పని తాను చేసుకుంటూ వెళ్లడం గమనార్హం . మొత్తంగా కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
