హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎరువుల ధరలలో వ్యత్యాసం ఉండడం వల్ల రైతులు తక్కువ ధరకు లభించే యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ లను వాడుతున్నారని దీని వల్ల తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ ధరకు దొరికే యూరియా విచ్చలవిడి వినియోగంతో నేల, పంటల నాణ్యతకు ముప్పు వాటిల్లుతుందన్నారు. విదేశాలలో మన పంటల ఉత్పత్తులపై గిరాకీ ఉండడం లేదన్నారు. ఎరువుల ధరలను రేషనలైజ్ చేయాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. మోతాదు మించి యూరియా వాడకంపై కేంద్రం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని ఆదేశించారు వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ ను. ఎరువుల వినియోగంలో సమతుల్యతపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
తెలంగాణలో యూరియా వినియోగం గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగిందన్నారు. 2015-16లో 14 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న యూరియా వినియోగం 2025-26 నాటికి 20.70 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు తుమ్మల నాగేశ్వర్ రావు. ముఖ్యంగా యూరియా, డీఏపీకి అధిక సబ్సిడీ ఉండటంతో వాటి వినియోగం పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్‌పీకే వినియోగ నిష్పత్తి 12.6:4.8:1గా ఉండగా, సిఫారసు చేసిన నిష్పత్తి 4:2:1 మాత్రమేనని పేర్కొన్నారు. యూరియా 45 కిలోల బస్తా సుమారు రూ.240-266కే లభిస్తుండగా, 50 కిలోల డీఏపీ బస్తా రూ.1,350, 19:9:19 కాంప్లెక్స్ ఎరువుల బస్తా రూ.1,750గా ఉందన్నారు. ఈ ధరల వ్యత్యాసం కారణంగా రైతులు పంటకు అవసరమైన పోషకాల సమతుల్యతను పట్టించు కోకుండా యూరియా, డీఏపీని అధిక మోతాదులో వినియోగించే పరిస్థితి ఏర్పడుతోందని వాపోయయారు.
వరి పంటలో సిఫారసు చేసిన మోతాదుతో పోలిస్తే రైతులు అధిక మోతాదులో ఫాస్పరస్, నైట్రోజన్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. మొక్కజొన్నలో సిఫారసు చేసిన మూడు బస్తాల యూరియాకు బదులుగా ఐదు నుంచి పది బస్తాల వరకు యూరియా వినియోగిస్తున్న పరిస్థితి ఉందన్నారు. పత్తిలోనూ నైట్రోజన్ వినియోగం సిఫారసు మోతాదుకంటే 10-15 శాతం అధికంగా ఉండగా, పొటాష్ వినియోగం సుమారు 30 శాతం తక్కువగా ఉందన్నారు . ఈ అసమతుల్య ఎరువుల వినియోగం వల్ల నేలలో జింక్, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాల లోపాలు ఏర్పడటంతో పాటు నైట్రోజన్ లీచింగ్ పెరిగి నేల, నీటి కాలుష్యానికి దారితీస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా చీడపీడలు, తెగుళ్ల ఉధృతి పెరిగి రైతులకు సాగు ఖర్చులు మరింత పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అధిక మోతాదులో యూరియా వినియోగం కేవలం నేల ఆరోగ్యానికే కాకుండా పంటల నాణ్యతపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులపై అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న డిమాండ్‌ను కాపాడుకోవాలంటే ఎరువుల వినియోగంలో సమతుల్యత పాటించడం అత్యంత అవసరం అని మంత్రి అన్నారు.
