విద్యార్థుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యత ఉండాలి

నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలపై హైడ్రా - ఇంటర్ బోర్డ్ ఆదేశం

హైద‌రాబాద్ : విద్యార్థుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యత ఉండాలని ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైడ్రా – ఇంటర్ బోర్డ్ కళాశాల యాజమాన్యాలకు సూచించింది. అనుకోని అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు విద్యార్థులు, బోధనా సిబ్బంది సురక్షితంగా బయట పడేలా తగిన చర్యలు తీసుకోవాలని క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కోరారు. అవసరమైన ఏవైనా మార్పులు లేదా చేర్పులు ఉంటే వాటిని తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. నకిలీ ఫైర్ ఎన్‌ఓసీల నేపథ్యంలో హైడ్రా కేసులు నమోదు చేసింది. ఇంటర్ బోర్డ్ సంబంధిత కళాశాలలపై చర్యలు ప్రారంభించింది. ఈ నేప‌థ్యంలో హైడ్రా ఇంటర్ బోర్డ్ యాజమాన్యాలతో సంయుక్త సమావేశం నిర్వహించింది. నకిలీ ఫైర్ ఎన్‌ఓసీల కారణంగా విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. అదే సమయంలో, ఈ కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు.

నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు జారీ చేయడానికి గల కారణాలను లోతుగా పరిశీలించారు. అనంతరం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అభిలాష అభినవ్ మాట్లాడారు. నకిలీ ఫైర్ ఎన్‌ఓసీల పేరుతో కళాశాల యాజమాన్యాలను వేధించడం ఏ శాఖ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. కళాశాల యాజమాన్యాలు కోరినట్లుగా ఫైర్ ఎన్‌ఓసీలను ఏటా కాకుండా ప్రతి రెండేళ్లకు ఒకసారి పునరుద్ధరించుకునే సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. రెండవ మెట్లదారి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఒకవేళ పాత భవనాలకు అర్హత లేకపోతే ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని కూడా సూచించారు. ఫైర్ ఎన్‌ఓసీలు , వాటి పునరుద్ధరణల కోసం దరఖాస్తులను హైడ్రా వెబ్‌సైట్ https://hydraafirenoc.telangana.gov.in ద్వారా సమర్పించాలని సూచించారు. బ్రోకర్లను నమ్మి మోసాలకు గురికావద్దని హెచ్చరించారు. ఫైర్ ఎన్‌ఓసీల జారీ ప్రక్రియను సులభతరం చేశామని తెలిపారు. హైడ్రాచే అధీకృత ఏజెన్సీల ద్వారా ఫైర్ ఎన్‌ఓసీల జారీకి సంబంధించిన ప్రతిపాదనలను కూడా సమీక్షిస్తామని ఆ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ నుండి అనుమతుల మంజూరు, పాత అనుమతుల పునరుద్ధరణ , సంబంధిత రుసుముల చెల్లింపు వరకు అన్ని ప్రక్రియలు ఆన్‌లైన్‌లోనే ప్రారంభించామ‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!