అర్జెంటీనా : అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ సాకర్ నుండి తన రిటైర్మెంట్ను ప్రకటించారు. 2022లో ప్రపంచ కప్ గెలిచి, ఈ క్రీడ యొక్క గొప్ప ఆటగాళ్ల సరసన తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న తన 21 ఏళ్ల జాతీయ జట్టు సేవకు దీనితో ముగింపు పలికారు. ఇది బాధించిన నిర్ణయం అన్నాడు. ఇదే తనను ఇప్పటికీ తీవ్రంగా బాధిస్తోంది అని వాపోయాడు. కానీ సమయం ఆసన్నమైందని నేను అర్థం చేసుకున్నాను అని 39 ఏళ్ల మెస్సీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. భావోద్వే గభరితమైన రిటైర్మెంట్ నోట్ రాశారు. మేజర్ లీగ్ సాకర్‌లో ఇంటర్ మయామితో క్లబ్ స్థాయిలో ఆడటం కొనసాగించనున్న మెస్సీ రికార్డు స్థాయిలో ఆరు ప్రపంచ కప్‌లలో ఆడాడు. నాలుగేళ్ల క్రితం ఖతార్‌లో తాను ఆధిపత్యం చెలాయించిన ఒక టోర్నమెంట్లో అతను దీనిని గెలుచుకున్నాడు. అలాగే 2014లో ,ఈ సంవత్సరం కూడా అర్జెంటీనాను టైటిల్ మ్యాచ్‌కు నడిపించాడు.
కానీ న్యూజెర్సీలో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్‌తో అదనపు సమయంలో అర్జెంటీనా ఓడిపోయింది. తనతో తరచుగా పోల్చబడే స్వదేశీయుడైన డియాగో మారడోనా , బ్రెజిల్ దిగ్గజం పీలేలతో పాటు, మెస్సీ కూడా సర్వకాలిక గొప్ప ఆటగాళ్ల సరసన నిలుస్తాడు. చాలా మందికి అతనే అత్యుత్తమం. గత కొన్నేళ్లలోనే కాదు, అంతకు ముందు కూడా నేను ఎల్లప్పుడూ నా సర్వస్వం ఇచ్చానని మీకు ప్రమాణం చేస్తున్నాను అని మెస్సీ రాశాడు. ఈ జెర్సీ కోసం మీకు ఆనందాన్ని పంచడానికి , ఫుట్‌బాల్ ద్వారా అర్జెంటీనా వాసులుగా మిమ్మల్ని గర్వపడేలా చేయడానికి నేను ఎల్లప్పుడూ పోరాడాను. మైదానంలో నా సర్వస్వాన్ని ధారపోశాను అని పేర్కొన్నాడు.
అర్జెంటీనా తరపున 207 మ్యాచ్‌లు ఆడి, 125 గోల్స్‌తో ఆ దేశపు ఆల్-టైమ్ లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు, వాటిలో 21 గోల్స్ ప్రపంచ కప్‌లలో సాధించాడు. పురుషుల అంతర్జాతీయ మ్యాచ్‌లలో అతని కంటే ఎక్కువ గోల్స్ చేసిన ఆటగాడు మరొకడు లేడు. అతని చిరకాల ప్రత్యర్థి క్రిస్టియానో రొనాల్డో 146 గోల్స్‌తో పోర్చుగల్ జట్టు నుండి ఇంకా తన విరమణను ప్రకటించలేదు.
