అక్టోబ‌ర్ 11న దుబాయ్ లో బ‌తుక‌మ్మ వేడుక‌లు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆహ్వానం

హైద‌రాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను దుబాయ్‌లో ఘనంగా నిర్వహించేందుకు గల్ఫ్ తెలంగాణ ఫోరమ్ , ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తున్నాయి. అక్టోబర్ 11న దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజలతో కలిసి సంబరాల్లో పాల్గొనాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నిర్వాహకులు ఆహ్వానించారు. జీటీఎఫ్ ఫౌండర్, అధ్యక్షుడు ఆకుల సురేందర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేటీఆర్‌ను కలిసి దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని అందజేసింది.
తెలంగాణ ఆడ పడుచులు, ప్రవాస తెలంగాణ కుటుంబాలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని కేటీఆర్‌ను ప్రత్యేకంగా కోరారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని గల్ఫ్ దేశాల్లోనూ కొనసాగించడంతో పాటు అక్కడి తెలంగాణ సమాజంలో తమ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళలు, యువత, చిన్నారులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

అక్టోబర్ 11న దుబాయ్‌లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. అనంతరం ఈటీసీఏ ఆధ్వర్యంలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మరో బతుకమ్మ వేడుక జరగనుంది. ఈ రెండు కార్యక్రమాల్లోనూ కేటీఆర్ పాల్గొంటారని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. ఈ సందర్భంగా దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ప్రత్యేక ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. బతుకమ్మను కేవలం తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపు కుంటున్నారని, గల్ఫ్ దేశాల్లోనూ ఈ పండుగకు విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. ప్రవాస తెలంగాణ సమాజం తమ స్వస్థలాలతో ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని కొనసాగించేందుకు బతుకమ్మ వేడుకలు ఒక వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేసేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!