భారత్ నా ‘ధర్మ భూమి’ కర్ణాటక నా ‘కర్మ భూమి’

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన న‌టుడు అనంత్ నాగ్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన అనంత్ నాగ్ భారతీయ చలనచిత్ర రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు. ఆయన ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడ్డారు. భారతీయ చలనచిత్ర రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను ఈ గౌరవం దక్కింది. అవార్డు ప్రకటనకు ముందు, భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ ఒక ప్రత్యేక వీడియో ప్రదర్శించారు. ఆయన వేదికపైకి వస్తుండగా, సభలోని వారంతా లేచి నిలబడి గౌరవ సూచకంగా చప్పట్లు చరిచారు. మమ్ముట్టి, ధనుష్, సంజయ్ మిశ్రా, యామీ గౌతమ్, ఆదిత్య ధర్ , కార్తీక్ ఆర్యన్ వంటి తోటి నటులు, అవార్డు గ్రహీతలు ఆయనను అభినందించిన వారిలో ఉన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన నటులు, చిత్ర నిర్మాతలు, ఇతర ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు అనంత్ నాగ్.

తన ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌ను గుర్తు చేసుకున్నారు ఈ అరుదైన న‌టుడు. అలాగే కర్ణాటకను తన కర్మభూమిగా, భారతదేశాన్ని తన ధర్మభూమిగా అభివర్ణించారు. 12 ఏళ్ల వయసులో ముంబైలో నాటకాలతో మొదలైన తన నట ప్రస్థానాన్ని ఆయన నెమరు వేసుకున్నారు. మీ అందరితో కలిసి ఇక్కడ ఉండటం గొప్ప గౌరవం, ఈ కార్యక్రమ వైభవాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలకు నేను పెద్దగా హాజరు కాలేదు, బహుశా ఇదే మొదటిదేమో, కానీ ఈ రోజు మీ అందరితో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది అని అనంత నాగ్ అన్నారు. నేను 12 ఏళ్ల వయసు వరకు ఒక ఆశ్రమంలో పెరిగాను. ఆ తర్వాత నన్ను ముంబైకి పంపారు. అక్కడ ఒక నాటకంలో నటించే అవకాశం వచ్చింది, దాంతో నా కెరీర్ మొదలైంది. అయితే, అప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి దాన్ని ‘కెరీర్’ అని అనలేను అని ఆయన పేర్కొన్నారు.

నాటక రంగంలో పని చేయడం భారతీయ సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి తనకు ఒక “శిక్షణా వేదిక”గా ఉపయోగ పడిందని ఆయన తెలిపారు. అయితే, కొంతకాలం తర్వాత, కన్నడ చలనచిత్ర రంగంలో తన నట ప్రస్థానాన్ని కొనసాగించాలని నాగ్ నిర్ణయించుకున్న‌ట్లు తెలిపారు. ఆ తర్వాత, ఒక నటుడిగా నా ప్రస్థానం మొదలైంది. ఐదేళ్లలో నేను దాదాపు 50 విభిన్న నాటకాలలో నటించాను.. అదే నాకు శిక్షణా వేదికగా నిలిచింది. ఆ తర్వాత సినిమాల్లో కొన్ని పాత్రలు పోషించే అవకాశం వచ్చింది. మొదట కన్నడలో ఆపై శ్యామ్ బెనెగల్ , ఇతర దర్శకులతో కలిసి హిందీలో నటించాను. నేను అనేక హిందీ చిత్రాలలో నటించినప్పటికీ కర్ణాటకలో కొత్త తరహా చిత్రాలు, వాణిజ్య చిత్రాలు, ఇతర అవకాశాలకు అద్భుతమైన వాతావరణం ఉండేది. అందుకే బెంగళూరుకు వెళ్లి అక్కడ స్థిరపడాలని నిర్ణయించుకున్నాను. అదే నా ‘కర్మభూమి’గా మారిందన్నారు అనంత్ నాగ్.

Leave A Reply

Your Email Id will not be published!