ఢిల్లీ : దీపావళి వేడుకలు ముగిసిన మరుసటి రోజైన సోమవారం నాడు ఢిల్లీ నగరం దట్టమైన పొగమంచు, పెరుగుతున్న వాయు కాలుష్యంతో మేల్కొంది. జాతీయ రాజధానిలో ఉదయం 6:15 గంటలకు గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 366గా నమోదైంది. దీంతో నగరం ‘అత్యంత అధ్వాన్నమైన’ కేటగిరీలో నిలిచింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) డేటా ప్రకారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ‘తీవ్రమైన’ గాలి నాణ్యత నమోదైంది. 59 పర్యవేక్షణ కేంద్రాలలో, 12 కేంద్రాలు తీవ్ర కాలుష్యాన్ని నివేదించగా, 22 కేంద్రాలు అత్యంత అధ్వాన్నమైన గాలి నాణ్యతను నమోదు చేశాయి.
శనివారం నాటి 369తో పోలిస్తే ఆదివారం నాడు నగర సగటు ఏక్యూఐ 376గా ఉంది. దీపావళి వేడుకల సందర్భంగా ప్రజలు బాణసంచా కాల్చడంతో కాలుష్య స్థాయి పెరిగింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పొగ, దృశ్యమానత తగ్గడం వంటివి కూడా పలువురు నివాసితులు తెలిపారు. కాలుష్య పరిస్థితి ఢిల్లీకే పరిమితం కాలేదు. నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ , గురుగ్రామ్‌తో సహా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లోని పలు ప్రాంతాల్లో కూడా అధిక కాలుష్య స్థాయిలు నమోదయ్యాయి. ఉదయం తీసుకున్న రీడింగ్‌ల ప్రకారం ఘజియాబాద్‌లో ఏక్యూఐ 372గా, నోయిడాలో 338గా నమోదైంది. ఫరీదాబాద్ , గురుగ్రామ్‌లలో ఏక్యూఐ స్థాయిలు వరుసగా 323 మరియు 306గా నమోదయ్యాయి.
వాహనాల పొగ, రోడ్డు దుమ్ము , పారిశ్రామిక కార్యకలాపాల వల్ల ఇప్పటికే ఉన్న కాలుష్యానికి, బాణసంచా ఉద్గారాలు కూడా తోడయ్యాయి. పంజాబ్ , హర్యానా వంటి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం కూడా ఈ సమస్యకు దోహద పడింది. వాతావరణ పరిస్థితులు , తక్కువ గాలి వేగం కారణంగా కాలుష్య కారకాలు చెదరడం కష్టంగా మారింది, ఫలితంగా ఈ ప్రాంతమంతటా దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది. ఢిల్లీలో గాలి నాణ్యత ‘తీవ్రమైన’ కేటగిరీలోకి ప్రవేశించి, రాబోయే కొద్ది రోజుల పాటు అదే స్థాయిలో కొనసాగవచ్చని వాయు నాణ్యత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ హెచ్చరించింది.
