అమరావతి : యువతకు ఉద్యోగాలు కూటమి నైజం అయితే రౌడీయిజం చేయడం, బెదిరింపులకు దిగడం , లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించచడం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నైజమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ వరకు కొనసాగి వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించి అధికారం అప్పగించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. చట్టబద్ధ పాలనతో రాష్ట్రంలో క్రైమ్ రేటును 14 శాతం తగ్గించామని, శాంతిభద్రతలు అదుపులో ఉండటం వల్లే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి తరలి వస్తున్నాయని స్పష్టం చేశారు.
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి నారా లోకేష్ అన్ని న్యాయపరమైన అడ్డంకులను ఛేదించి 16,000 మందికి పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశారని హోం మంత్రి పేర్కొన్నారు. రిక్రూట్మెంట్ విధానంపై లోకేష్ స్వయంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి వివరాలు వెల్లడించడమే కాకుండా బహిరంగ చర్చకు రావాలని మూడుసార్లు సవాల్ విసిరారని , అయినా జగన్‌కు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేక పోయిందన్నారు. కడపలో స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన 350 మందికి పైగా క్రీడాకారులు తమ సర్టిఫికెట్లు, టెట్ అర్హత పత్రాలతో విజయవాడలోని శాప్ కార్యాలయానికి వచ్చి రక్షణ కోరితే, తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో 50-60 కార్లలో వచ్చిన వైసీపీ రౌడీ మూకలు వారిపై రాళ్లు, గాజు సీసాలు, ఇనుప రాడ్లతో పాశవిక దాడికి దిగడం దుర్మార్గమన్నారు.
శాప్ కార్యాలయం వద్ద నిరసనల పేరుతో వీరంగం సృష్టించిన వారిలో 60 నుంచి 70 శాతం మంది నేరచరిత్ర కలిగిన రౌడీషీటర్లు, పోక్సో కేసులు, హత్యాయత్నం కేసులు, బ్లేడ్ బ్యాచ్‌లతో సంబంధాలు ఉన్నవారేనని ఫోటోలు, కేసుల వివరాలతో సహా హోం మంత్రి మీడియా ముందు బట్టబయలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలపై 37 క్రిమినల్ కేసులు ఉన్నాయని, టీడీపీ కేంద్ర కార్యాలయంపై గతంలో దాడి చేసిన విద్యార్థి విభాగం నేత చైతన్యపై 22 కేసులు, కంచికచర్లకు చెందిన రౌడీషీటర్ సురేష్ బాబుపై మర్డర్ కేసులు, మరికొందరిపై 13-14 కేసులు, తీవ్రమైన పోక్సో కేసులు ఉన్నాయని ఆధారాలు ప్రదర్శించారు. ఇటువంటి నేరగాళ్లను ‘జెన్‌జీ’ యువత అంటూ అమాయక విద్యార్థులుగా చిత్రీకరిస్తూ, ‘వి స్టాండ్ విత్ రాజ్ పాల్’ అంటూ పోస్టర్లు వేసుకుని గవర్నర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చదువుకునే యువతను రాజకీయ స్వార్థానికి రౌడీలుగా మార్చే కుట్రలను తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలను అప్రమత్తం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని ప్లంబర్లు, కార్మికులతో చేయించిన అక్రమాలపై గానీ, లిక్కర్ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్‌కు చేరాయంటూ వెలువడిన వాంగ్మూలాలపై గానీ జగన్ ఎందుకు నోరు మెదపరని అనిత నిలదీశారు. ఆ అవినీతి పాపాలు బయట పడటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే డీఎస్సీపై తప్పుడు కూతలు కూస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టి అవమానించిన చరిత్ర జగన్‌దని, కూటమి ప్రభుత్వం బడిని గుడిగా, గురువులను దైవంగా భావిస్తూ గౌరవిస్తోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులపై దాడికి తెగబడిన రౌడీషీటర్లు, సంఘ విద్రోహ శక్తుల వికృత చేష్టలన్నీ సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, రౌడీయిజంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర హెచ్చరికలు చేశారు