వ‌చ్చే ఏడాది నుంచి 12వ త‌ర‌గ‌తి విధానం : సీఎం

విద్యార్థుల ప్ర‌యోజనాలే ల‌క్ష్యంగా సంస్క‌ర‌ణ‌లు

హైద‌రాబాద్ : విద్యార్థుల‌ ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. న‌ర్స‌రీ నుంచి యూనివ‌ర్సిటీ వ‌ర‌కు నాణ్య‌మైన విద్యా బోధ‌న ద్వారా ఆధునిక ప్ర‌పంచ అవ‌స‌రాల‌కు అనుగుణంగా విద్యార్థుల‌ను తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. విద్యా శాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వ‌చ్చే ఏడాది నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విధానాన్ని అమ‌లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప్ర‌గ‌తిని అధికారులు వివ‌రించారు. న‌ర్స‌రీ నుంచి 4వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్రాథ‌మిక విద్య‌, 5 నుంచి 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సెకండరీ, 9 నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సీనియ‌ర్ సెకండ‌రీ విధానాన్ని అమ‌లు చేయాల‌ని ఆదేశించారు. 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్థులను భాషా, స‌మాచార నైపుణ్యాల‌పై పూర్తి ప‌ట్టు సాధించేలా తీర్చి దిద్దాలన్నారు. 12 వ త‌ర‌గ‌తి త‌ర్వాత త‌మ‌కు న‌చ్చిన స‌బ్జెక్టును ఎంచుకొని అందులోని నిపుణులుగా మారేందుకు విద్యార్థుల‌కు అవ‌కాశం ఉండాల‌న్నారు.

10వ‌ త‌ర‌గ‌తి త‌ర్వాత స‌గ‌టున 40 శాతం మంది విద్యార్థులు చ‌దువు మానేస్తున్నార‌ని అందులో అత్య‌ధికులు బాలిక‌లు, ద‌ళిత, గిరిజ‌న‌, మైనారిటీ వ‌ర్గాల‌కు చెందిన పిల్ల‌లే ఉంటున్నార‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు కొన‌సాగింపు ఉన్న కేంద్రీయ, న‌వోద‌య విద్యాల‌యాలు, క‌స్తూర్బా గాంధీ బాలికల విద్యాల‌యాల్లో డ్రాపౌట్స్ సంఖ్య చాలా స్వ‌ల్పంగా ఉంటోంద‌న్నారు. దేశంలో 18 రాష్ట్రాల్లో 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విధాన‌మే అమ‌ల్లో ఉంద‌న్నారు. విద్యార్థుల ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీఎం స్ప‌ష్టం చేశారు. జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లోని లెక్చ‌ర‌ర్లు, బోధ‌నేత‌ర సిబ్బంది ఉద్యోగ‌, రిటైర్‌మెంట్ బెనిఫిట్ల‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామ‌ని తెలిపారు.

రాష్ట్రంలో సంక్షేమ వ‌స‌తి గృహాలు, రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అద్దె భ‌వ‌నాల్లో కొన‌సాగ‌డానికి వీల్లేద‌ని సీఎం అన్నారు. ఆయా వ‌స‌తి గృహాలు, రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల‌ను పూర్తి వ‌స‌తుల‌తో నిర్మించ‌డానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ వెంట‌నే ప్రారంభించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వాటి నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన నిధులు విడుద‌ల చేస్తామ‌ని సీఎం తెలిపారు. పాఠ‌శాల‌లు, హాస్ట‌ళ్లు, రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల‌లో మ‌రుగుదొడ్లు నిర్మించాల‌ని, వాటికి పూర్తి స్థాయిలో నీటి వ‌స‌తి క‌ల్పించాల‌ని సీఎం ఆదేశించారు.

Leave A Reply

Your Email Id will not be published!