అమరావతి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిరుద్యోగులుకు ఖుష్ కబర్ చెప్పింది. ఇప్పటికే వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ ప్రకటిస్తూ వచ్చింది. తాజాగా మరో భారీ నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఏపీపీఎస్సీ గ్రూప్ -2 నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందులో మొత్తం 720 పోస్టులు ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రకటించిన ఖాళీలలో 471 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 249 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు సమర్పణకు డిసెంబర్ 11 రాత్రి 11:59 గంటల వరకు గడువు విధించారు. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్షను 2027 ఫిబ్రవరి 21న ఆఫ్లైన్ పద్ధతిలో (ఓఎంఆర్ ఆధారితంగా) నిర్వహిస్తారు. ఆన్లైన్లో నిర్వహించే మెయిన్ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ను కమిషన్ తర్వాత ప్రత్యేకంగా ప్రకటిస్తుంది.
ఎగ్జిక్యూటివ్ పోస్టులలో 203 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు, 176 డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు 40 గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) అధికారులు, 29 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. నాన్-ఎగ్జిక్యూటివ్ విభాగంలో 80 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) పోస్టులు, 91 సీనియర్ అకౌంటెంట్ పోస్టులతో పాటు మరికొన్ని ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ నోటిఫికేషన్లో పోస్టుల వారీగా ఖాళీలు, వయో పరిమితి, వేతన శ్రేణులు, జోన్ల వారీగా పోస్టుల విభజన , పరీక్షా విధానం వంటి వివరాలు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదివి, తమ అర్హతలను సరి చూసుకోవాలని స్పష్టం చేసింది ఏపీపీఎస్సీ.
