వ్యక్తిగత ప్రయోజనాల కోసం హోదాను దుర్వినియోగం చేయొద్దు
సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తమ హోదాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయవద్దని పోలీసులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పోలీసు విభాగంలో కొత్తగా నియమితులైన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులు తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, వారి నైపుణ్యాలను మెరుగు పరిచే ఉద్దేశంతో ప్రభుత్వం వారిని విదేశీ అధ్యయన పర్యటనలకు పంపడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇక్కడ జరిగిన డీఎస్పీల (2025 బ్యాచ్) శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యా ప్రమాణాలను అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయులను విదేశాలకు పంపుతున్నామని చెప్పారు. అదే తరహాలో అవసరమైతే కొత్తగా నియమితులైన డీఎస్పీలను కూడా ఉన్నత అధ్యయనాల కోసం విదేశాలకు పంపుతామని చెప్పారు. డీఎస్పీలు తమ విధుల్లో రాణించడంతో పాటు శారీరక దృఢత్వానికి (ఫిట్నెస్) కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
మాదకద్రవ్యాల సమస్య, సైబర్ నేరాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి బాధితులు పోలీసుల వద్దకు వచ్చినప్పుడు వారితో స్నేహ పూర్వకంగా, సానుభూతితో వ్యవహరించి, వారి సమస్యలను అర్థం చేసుకోవాలని సూచించారు. తమ హోదాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవద్దని పోలీసులను ఆయన హెచ్చరించారు. ఏదైనా సమస్యపై పరిష్కారం కనుగొనే ముందు, పోలీసులు ఆ సమస్యను పూర్తిగా విని, అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు. మీ జ్ఞానం, నిజాయితీ, అంకితభావమే మిమ్మల్ని నేడు ఈ స్థాయికి చేర్చాయి అని ఆయన అన్నారు.
పోలీసు బలగాల్లో చేరిన ఉద్దేశ్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని కొత్తగా నియమితులైన డీఎస్పీలకు ముఖ్యమంత్రి సూచించారు. రాబోయే ముప్పై ఏళ్లలో తెలంగాణ భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందనేది పోలీసుల చేతుల్లోనే ఉందన్నారు. ప్రజలు ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు స్పందించే మొదటి వ్యక్తులు పోలీసులేనని రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు తమ సర్వస్వాన్ని అంకితం చేయడం వల్లే ప్రజలు వారిని నమ్ముతున్నారని, ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని విధులు నిర్వహించాలన్నారు సీఎం.