తిరుపతి : తిరుపతిలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకపిలేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ నెల రోజుల పాటు నిర్వహించనున్న విశేష పూజలు, హోమ మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. నేటి నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు అత్యంత వైభవంగా ఈ హోమ మహోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు గణపతి పూజ, పుణ్యాహ వచనం, వాస్తుపూజ, పర్యన్నీకరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠ, లఘుపూర్ణాహుతి చేపట్టారు. నవంబరు 11వ తేదీ వరకు శ్రీగణపతి స్వామివారి హోమం, నవంబరు 12, 13 తేదీల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం, నవంబరు 14న ధర్మశాస్త్ర హోమం, నవంబరు 15న శ్రీ నవగ్రహ హోమం నిర్వహించనున్నారు.
16న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, నవంబరు 17న శ్రీ కాలభైరవ స్వామివారి హోమం, నవంబరు 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి చండీహోమం నిర్వహిస్తారు. నవంబరు 27 నుంచి డిసెంబరు 7వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి రుద్రహోమం, డిసెంబరు 8న శ్రీ చండికేశ్వర స్వామివారి హోమం నిర్వహించనున్నారు. చివరి రోజున త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం వైభవంగా జరగనున్నాయి. భక్తులు ఇద్దరు గృహస్తులు కలిపి రూ.500 చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు. హోమాల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రధారణతో రావాల్సి ఉంటుంది.
ఈ హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 15న శ్రీ వళ్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణోత్సవం, డిసెంబరు 7న మాస శివరాత్రి సందర్భంగా శ్రీ శివ పార్వతుల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఒక్కో కల్యాణోత్సవంలో ఇద్దరు గృహస్తులు రూ.500 చెల్లించి పాల్గొనే అవకాశం కల్పించారు.శ్రీకపిలేశ్వరాలయంలో టీటీడీ 2012వ సంవత్సరం నుంచి ఈ హోమ మహోత్సవాలను నిర్వహిస్తోంది. ఏటా భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుండగా, హోమాల్లో పాల్గొనే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వ్యక్తిగతంగా ఈ హోమాలను నిర్వహించు కోవడం ఖర్చుతో కూడుకున్నది కావడంతో, సామాన్య భక్తులకు సైతం హోమ ఫలాన్ని పొందే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ సామూహికంగా వీటిని నిర్వహిస్తోంది.
