న్యూఢిల్లీ : జాతీయ మహిళా కమిషన్‌కు ఏటా సుమారు 1.5 లక్షల ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిలో గృహహింసకు సంబంధించినవే అత్యధికమని కమిషన్ చైర్ పర్సన్ విజయ రహత్కర్ తెలిపారు. మహిళలకు సహాయం అందించేందుకు, కమిషన్ దేశ వ్యాప్తంగా బహిరంగ విచారణలను నిర్వహిస్తుందని ,ఫిర్యాదులు చేయడానికి వివిధ మార్గాలను అందుబాటులో ఉంచిందని ఆమె పేర్కొన్నారు. మహిళలు తమ ఫిర్యాదులను నమోదు చేయడానికి కమిషన్ ఆన్లైన్ పోర్టల్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ , ఈమెయిల్, నేరుగా వచ్చి కలవడం లేదా 24×7 హెల్ప్‌లైన్ వంటి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు.
మాకు ఏటా సుమారు 1.5 లక్షల ఫిర్యాదులు అందుతున్నాయి. మా పరిధిలోకి వచ్చే కేసులను పరిశీలిస్తే, గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులే అత్యధికంగా ఉన్నాయి అని ఆమె చెప్పారు. ఫిర్యాదు ఎలా చేయాలో తెలియదనే కారణంతో ఏ మహిళా కూడా జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించలేక పోయామని భావించకూడదు అని పేర్కొన్నారు. కమిషన్ హెల్ప్‌లైన్ నంబర్ ‘14490స , వెబ్సైట్ గురించి గుర్తు చేశారు చైర్ పర్సన్ . అంతే కాకుండా కమిషన్ చేపట్టిన ‘రాష్ట్రీయ మహిళా ఆయోగ్ ఆప్కే ద్వారా’ (జాతీయ మహిళా కమిషన్ మీ వద్దకే) అనే కార్యక్రమం గురించి ఆమె వివరించారు. దీని ద్వారా కమిషన్‌ను నేరుగా సంప్రదించడం కష్టంగా భావించే మహిళల కోసం వివిధ రాష్ట్రాల్లో బహిరంగ విచారణలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు మా దగ్గరకు రాలేని పక్షంలో, మేమే వారి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం అని ఆమె చెప్పారు.
తాను చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన గత ఏడాదిన్నర కాలంలో, దేశవ్యాప్తంగా వివిధ గ్రామాలు , ఇతర ప్రాంతాల్లో 200కు పైగా బహిరంగ విచారణలను నిర్వహించినట్లు ఆమె తెలిపారు. మేము చాలా మంది మహిళలను కలిసి, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించామని పేర్కొన్నారు.