అమరావతి : ప్రజలకు అందుబాటులో ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, సామాజిక భద్రత వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో విశిష్ట స్థానాన్ని సాధించింది. యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ AEI–2026లో దేశంలోని 28 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఓ.పీ. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్స్ స్టడీస్ రూపొందించి విడుదల చేసిన ఈ నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. తమ ప్రభుత్వం గత రెండున్నరేళ్ల కాలంలో చేపడుతున్న పరిపాలనకు అద్దం పట్టేలా ఈ నివేదిక ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సూచీ రాష్ట్రాల ఆర్థిక సంపదతో పాటు ప్రజలకు దక్కుతున్న సమాన అవకాశాలు, పౌరులకు అవసరమైన సేవలు అందించేందుకు ఆ సంపదను ప్రభుత్వాలు ఎంత సమర్థంగా వినియోగిస్తున్నాయన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రూపోందించిందని పేర్కొన్నారు. గోవా 0.68 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 0.66 స్కోరుతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
సిక్కిం 0.63, కేరళ 0.60, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు 0.57 స్కోరుతో ఏపీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ సూచీ ఆధారంగా సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్స్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్‌ను ఫ్రంట్ రన్నర్ రాష్ట్రంగా గుర్తించింది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఏపీ అత్యధిక ర్యాంకు సాధించడం విశేషం. ఐదు ప్రధాన అంశాల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. ప్రాథమిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక-ఆర్థిక భద్రత, న్యాయ సేవలు వంటి అంశాలను ఇందులో పరిశీలించారు. మొత్తం 23 విభాగాల్లోని 60 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతి అంశానికి సమాన ప్రాధాన్యమిచ్చారు. ఈ ఐదు అంశాల్లో సామాజిక, ఆర్థిక భద్రత విభాగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించింది. ఈ విభాగంలో ఏపీ 0.69 స్కోరు సాధించగా, రెండో స్థానంలో ఉన్న గోవా 0.50 స్కోరుకే పరిమితమైంది. మిగిలిన నాలుగు విభాగాల్లోనూ దేశంలో అగ్రరాష్ట్రాల జాబితాలో ఏపీ నిలిచింది.