హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 5 శాతం పెరిగి రూ.687.01 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 18 శాతం వృద్ధితో రూ.109.89 కోట్లకు చేరింది. పన్నుల అనంతర లాభం 5 శాతం పెరిగి రూ.52.12 కోట్లుగా నమోదైంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 401 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో 375 వాహనాలను విక్రయించగా.. ఈసారి 7 శాతం వృద్ధి సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో మొత్తం 759 వాహనాలను డెలివరీ చేసింది. ఓలెక్ట్రా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,750కుపైగా ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేసింది. 55 నగరాల్లో ప్రజా రవాణా సేవలకు తన బస్సులను అందిస్తోంది. ఈ వాహనాలు ఇప్పటి వరకు 750 మిలియన్లకు పైగా గ్రీన్ కిలోమీటర్లు ప్రయాణించాయి. కంపెనీ వద్ద 8,000కుపైగా ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్లు ఉన్నాయి.
నాలుగో త్రైమాసికంలో కొత్త తరం ఎలక్ట్రిక్ బస్సులను మార్కెట్లోకి తీసుకు రానున్నట్లు ఓలెక్ట్రా మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ బాబు తెలిపారు. స్థానికంగా తయారీకి ప్రాధాన్యం ఇస్తూ.. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా వీటిని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్రైమాసిక ఫలితాలు ఆదాయం, వాహన విక్రయాలు, లాభదాయకతలో స్థిరమైన వృద్ధిని ప్రతిబింబిస్తున్నాయని ఆయన తెలిపారు. నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై కంపెనీ దృష్టి సారించిందన్నారు. ఆర్డర్ల అమలు, ఉత్పత్తి సామర్థ్యాల విస్తరణ, వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించడం తమ ప్రాధాన్యాలని వివరించారు.
గత ఏడాది రెండో త్రైమాసికంలో రూ.656.62 కోట్లుగా ఉన్న ఆదాయం ఈసారి రూ.687.01 కోట్లకు చేరింది. పన్నులకు ముందు లాభం (PBT) రూ.68.46 కోట్ల నుంచి రూ.72.74 కోట్లకు పెరిగింది. ఒక్కో షేరుపై ఆర్జన (EPS) రూ.6.04 నుంచి రూ.6.45కు చేరింది. దేశంలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఉన్న ఆర్డర్లను పూర్తి చేయడం, నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.