చెన్నై : తెలుగు నటుడు రామ్ పోతినేని తమిళ చలన చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అవుతున్నారు. ఆయన తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ధర్మన్’ చిత్రంలో చేరారు. దీనితో ఆయన తమిళ చిత్రసీమలోకి అడుగు పెడుతున్నారు. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో కమల్ హాసన్‌కు చెందిన ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ నిర్మిస్తున్నారు ఈ యాక్షన్-థ్రిల్లర్ చిత్రాన్ని. ఈ మూవీలో నయనతార కూడా ఉండటంతో మరింత ఆకర్షణగా మారింది ఈ మూవీ. భారీ తారాగణంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. దిగ్గజ నటుడు రజనీకాంత్‌తో కలిసి ఆయన స్క్రీన్‌ను పంచుకోనుండటం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించనుంది.
ఈ చిత్రానికి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను అన్బరివ్ రూపొందిస్తున్నారు. కమల్ హాసన్ , ఆర్. మహేంద్రన్ కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ పోతినేని తనదైన శక్తివంతమైన నటన,ప్రత్యేకమైన ఎనర్జీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘దేవదాసు’ చిత్రంతో పరిచయమైన తను ఆ తర్వాత ‘రెడీ’, ‘కందిరీగ’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
‘ధర్మన్’ విషయానికి వస్తే, ఇది ఒక యాక్షన్-థ్రిల్లర్ చిత్రం. ఇందులో రజనీకాంత్ ఒక స్టైలిష్. రహస్యమైన డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు, దీనిని ‘ది డెడ్లీ డాక్టర్’ అని పేర్కొంటున్నారు. విడుదలైన ఫస్ట్-లుక్ పోస్టర్లో ఆయన సర్జన్ దుస్తుల్లో, రక్తంతో తడిసిన శస్త్రచికిత్స పరికరాన్ని పట్టుకుని కనిపించారు. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు , రజనీకాంత్‌కు మాత్రమే సొంతమైన శైలి కలగలిసిన చిత్రమిది. ఆసక్తికరమైన కథాంశం , ప్రతిభావంతులైన బృందంతో రూపొందుతున్న ‘ధర్మన్’, తమిళంలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
