అమరావతి : ఏపీని పెట్టుబడులకు, పారిశ్రామికాభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నెల 12, 13వ తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్–2026ను ప్రభుత్వం నిర్వహించనుంది. గతేడాది నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు భిన్నంగా 2026 సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఇప్పటికే ఐదు ప్రాంతీయ సదస్సులు నిర్వహణతో రూ.86 వేల కోట్ల పెట్టుబడులను వచ్చాయి. అలాగే వివిధ రంగాలపై ప్రాంతీయ సదస్సుల్లో చర్చలు జరిగాయి. దీంతో పెట్టుబడుల సదస్సులో ఎలాంటి చర్చలు జరుగుతాయోననే అంశంపై అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య సంయుక్తంగా చేపట్టనున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థల అధినేతలు హాజరు కానున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని, వివిధ దేశాల ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామిక సంస్థల అధినేతలతో భేటీ అవుతారు. నవంబర్ 12వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో సదస్సు ప్రారంభ కార్యక్రమం జరగనుంది.
సదస్సు ప్రారంభం కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. ఆ తర్వాత జరగనున్న వివిధ సెషన్లు… సమావేశాల్లో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు భాగస్వాములు కానున్నారు. అలాగే కీలక సమావేశాల్లో సీఎం చంద్రబాబు పాల్గొని… ఆయా అంశాలపై చర్చించడంతో పాటు… రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను వివరించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అందుబాటులో ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక విధానాలు, తయారీ, సాంకేతిక రంగాల్లోని అవకాశాలను పారిశ్రామిక వర్గాలకు సీఎం వివరిస్తారు. సీఐఐ సమ్మిట్‌లో భాగంగా ముఖ్యమంత్రి పలు దేశాల మంత్రులు, రాయబారులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమవుతారు. సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్వాటెమాలా, స్లోవేకియా దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. అలాగే జపాన్, రష్యా రాయబారులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. వీరితో పాటు ప్రపంచ మేధోసంపత్తి సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డారెన్ టాంగ్తో కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇక సదస్సులో ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, నిర్మాణ సామగ్రి, మౌలిక సదుపాయాలు, మాన్యుఫ్యాక్చరింగ్, సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు భాగస్వాములు కానున్నారు.
కియా మోటార్స్‌కు, రెన్యూ, మాండెలెజ్ ఇండియా, సెయింట్ గోబెయిన్, నాల్కో, లెవిస్టా వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు సదస్సులో భాగస్వాములు కానునున్నారు. ఇక సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా స్పేస్ రంగంలోని స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు నిలవనున్నారు. అంతరిక్ష సాంకేతికత, పరిశోధన, తయారీ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను విస్తరించే లక్ష్యంతో తేదీన ప్రముఖ భారతీయ ప్రైవేటు అంతరిక్ష సంస్థల ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో హాథోర్ రాకెట్స్, అగ్నికుల్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, స్కైరూట్ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. అలాగే జపాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ చైర్మన్‌తో సీఎం భేటీ అవుతారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలోనే మహిళా సాధికారతకు ప్రాధాన్యతిస్తూ ఓ సమావేశం నిర్వించనున్నారు. దీనికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ‘విమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్–2026’ పేరుతో విశాఖ నోవోటెల్లో ప్రారంభ కార్యక్రమం జరగనుంది. మహిళల ఆర్థిక సాధికారత, పారిశ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యం, వ్యాపారవేత్తలుగా మహిళలకు ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చించనున్నారు.
