హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మక ‘ఆర్యదన్ మహమ్మద్ – 2026’ ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డుకు ఎంపికయ్యారు. శుక్రవారం కేరళలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కేరళకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు దివంగత ఆర్యదన్ మహమ్మద్ జ్ఞాపకార్థం ‘ఆర్యదన్ మహమ్మద్ ఫౌండేషన్’ ఈ అవార్డును ప్రదానం చేస్తూ వస్తోంది గత కొంత కాలంగా . తెలంగాణ రాష్ట్రంలో రైతులు, వెనుకబడిన తరగతులు, ఇతర వర్గాల సంక్షేమం కోసం అమలు చేసిన వినూత్న పథకాలు, అలాగే ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా సీఎం రేవంత్ రెడ్డిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్కింగ్ చైర్మన్ , నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదన్ షౌకత్ తెలిపారు.
ఎంపీ బెన్నీ బెహనన్, కేరళ రెవెన్యూ మంత్రి ఎ.పి. అనిల్ కుమార్ , ప్రముఖ మేధావి కల్పట్ట నారాయణన్‌లతో కూడిన ఎంపిక కమిటీ (జ్యూరీ) ప్రజాస్వామ్య విలువలను పాటించడంలో తెలంగాణ సీఎంకున్న నిబద్ధతను ప్రశంసించింది. ఆర్యదన్ మహమ్మద్ నాలుగవ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కేరళలోని నిలంబూర్‌లో సీఎం రేవంత్ రెడ్డికి ఈ అవార్డును ఫౌండేషన్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎంకు రూ. 1 లక్ష నగదు బహుమతి, ప్రశంసాపత్రం , జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో AICC ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కె.సి. వేణుగోపాల్ ‘ఆర్యదన్ మహమ్మద్ స్మారక ఉపన్యాసం’ ఇచ్చారు.
కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ఆర్యదన్ మహమ్మద్ ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కేరళ ప్రభుత్వంలో నాలుగు వేర్వేరు మంత్రివర్గాల్లో వివిధ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా, దూరదృష్టి గల నాయకుడిగా, అద్భుతమైన పార్లమెంటేరియన్‌గా, సమర్థవంతమైన పరిపాలనాదక్షుడిగా , శ్రామిక వర్గాల పక్షపాతిగా ఆయన కేరళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. నిజాయితీ, లౌకిక విలువల పట్ల నిబద్ధత , ప్రజా సంక్షేమం పట్ల అంకితభావానికి కూడా ఆర్యదన్ ఎంతో పేరు పొందారు.