ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ఈడీ సమన్లు

సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసులో

హైద‌రాబాద్ : ఎమ్మెల్యే అరికె పూడి గాంధీకి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆయ‌న‌కు స‌మ‌న్లు జారీ చేసింది. హైదరాబాద్ లో నిర్మాణ రంగంలో ఉన్న సాహితీ ఇన్ ఫ్రా సంస్థ మ‌నీ లాండ‌రింగ్ కేసులో త‌న‌కు ఈ స‌మ‌న్లు జారీ చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం స‌మ‌న్లు జారీ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇందుకు సంబంధించి సెప్టెంబ‌ర్ 27వ తేదీన త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. గ‌తంలో సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై మనీలాండరింగ్ కేసు న‌మోదైంది. ప‌లువురిపై కేసులు న‌మోదు చేసింది. గ‌త కొంత కాలంగా విచార‌ణ జ‌రుపుతోంది. ఈ కేసు ద‌ర్యాప్తులో భాగంగా తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసిన‌ట్లు స‌మ‌న్ల‌లో పేర్కొంది. ఎమ్మెల్యే గాంధీకి నిన్న నోటీసులు అందజేశారు ఈడీ అధికారులు.

ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతాల ద్వారా సాహితి ఇన్‌ఫ్రా నుంచి రూ.2.1 కోట్లు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.2.1 కోట్ల లావాదేవీలపై ఆరా తీస్తోంది ఈడీ. లావాదేవీల స్వభావం, ఉద్దేశంపై దర్యాప్తు ప్రారంభించింది. నిధులకు సరైన వ్యాపార కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేప‌డుతోంది.
అంతే కాకుండా మనీలాండరింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఆస్తులపై కూడా ఈడీ దృష్టి సారించింది. ఫ్లాట్లు, విల్లాలు నిర్మిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయలేదంటూ కొనుగోలుదారులు ఫిర్యాదులు చేశారు.
తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేప‌ట్టింది. సాహితి ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో తొలుత రూ.248 కోట్ల మోసం జరిగినట్లు ఆరోపణలు వ‌చ్చాయి. తదుపరి దర్యాప్తులో మోసం విలువ సుమారు రూ.842 కోట్లుగా ఈడీ అంచనా వేసింది. ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారుల నుంచి భారీగా నిధుల సేకరణ చేప‌ట్టారు. నిధులను సొంత, కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంస్థ ఎండీ బి. లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావుపై అభియోగాలు మోపారు.

Leave A Reply

Your Email Id will not be published!