హైదరాబాద్ : తమ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రకటించారు రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. సోమవారం బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ తో పాటు ఇందిరా మహిళా శక్తి ద్వారా నిర్వహించే స్ట్రీట్ వెండర్స్ కి సంబంధించిన ఎగ్స్ షాప్ ప్రారంభించారు. మహిళా సంఘాలకు 1.20 కోట్ల రూపాయల సున్నా వడ్డీ రుణాలు చెక్కు అందించారు. విద్యార్థులకు స్కూల్ యూనిఫారం పంపిణీ చేశారు ముషీరాబాద్ లోని బాగ్ లింగంపల్లి వార్డ్ 163 వద్ద 1.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో SWD డ్రెయిన్ సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు . కార్యక్రమంలో పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ,ఇతర ముఖ్య నేతలు, అధికారులు .
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ క్యాంటీన్లను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించామన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని చెప్పారు.హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ కష్టపడి పని చేసుకుంటూ జీవనం సాగించే పేద, సామాన్య ప్రజలకు కేవలం రూ.5కే నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం మహిళలకు ఆర్ధిక వృద్ధి సాధించడానికి వారి చేత ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ఏర్పాటు చేస్తుందన్నారు.
ప్రభుత్వం తరఫున అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తూ శాశ్వత నిర్మాణాలతో, అన్ని సౌకర్యాలతో క్యాంటీన్లను అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పారు మంత్రి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం సమీపంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలన్నదే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం అని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని మహిళలు కూడా పెద్ద సంఖ్యలో స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరాలని కోరారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు గతంలో రూ.5 లక్షల వరకు అందించిన వడ్డీలేని రుణ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచిందన్నారు.
