హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి పారిశ్రామిక కేంద్రంగా మార్చే ప్రక్రియలో భాగంగా యువతకు, మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ అనుముల పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలో పేర్కొన్న అర్బన్ ప్రాంతంలో స్టార్టప్‌లు , ఇతర పరిశ్రమలను స్థాపించడం ద్వారా ఈ అద్భుతమైన అవకాశాలను అంది పుచ్చుకోవాలని యువ పారిశ్రామికవేత్తలకు పిలుపు ఇచ్చారు. గ్లోబల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ – 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా, తమ ఆలోచనలను నూతన తరంతో పంచుకుంటూ తద్వారా ఆ తరాన్ని అభివృద్ధి వైపు నడిపించే స్ఫూర్తితో పని చేస్తున్న సమఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సీఎం అభినందించారు.యువతరానికి విభిన్న ఆలోచనలు, ప్రపంచ పరిణామాలు, ఆవిర్భవిస్తున్న కొత్త విధానాలను సంపూర్ణంగా అందించాలంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల విధానాలను అర్థం చేసుకోవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులు, చట్టాల పైనా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వాణిజ్య మండళ్లు నిర్వహించే సమావేశాలు , సదస్సులు ప్రపంచ వ్యాప్త మార్పులు, కొత్త విధానాలు, చట్టాల గురించి యువతలో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒకే వేదిక పైకి తీసుకు రావడం, వారి ఆలోచనలు, అనుభవాల నుండి నేర్చుకోవడం ద్వారా యువత ఎంతో ప్రయోజనం పొందుతారని అన్నారు.
పారిశ్రామిక, రాజకీయ, న్యాయ , చలన చిత్ర రంగాలలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు సాధించిన విజయాలను నమోదు చేసి, వాటిని భావి తరాలకు అందించడం ద్వారా యువతకు స్ఫూర్తిని ఇవ్వ వచ్చని అన్నారు రేవంత్ రెడ్డి. భారతదేశానికి 2047 సంవత్సరం అత్యంత ప్రాముఖ్యత కలిగినదని అన్నారు. స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే సమయానికి, దేశం సాధించిన పురోగతిని సమీక్షించు కోవడంతో పాటు, భవిష్యత్తు లక్ష్యాలను సాధించడానికి స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే ‘వికసిత్ భారత్-2047’ లక్ష్యాన్ని సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.తాము రాష్ట్రాన్ని మూడు ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజించామని తెలిపారు. ప్రతి ప్రాంతం భౌగోళిక పరిస్థితులు, జనాభా , వనరులకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం జరిగిందన్నారు సీఎం. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని సుమారు 2,100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దాదాపు 1.34 కోట్ల జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ‘కోర్ అర్బన్ రీజియన్’ ను గుర్తించినట్లు తెలిపారు. హైదరాబాద్ నుండి కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలి ప్రాంతాలకు తరలించాలని, నగరంలో సేవా రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతం నుండి కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించడానికి అవసరమైన ప్రోత్సాహకాలు, అనుమతులు , ఇతర మద్దతును అందించే లక్ష్యంతో తాము హిల్ పాలసీని ప్రవేశ పెట్టామన్నారు.
