వేణు గోపాల స్వామి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి

భక్తిభావంతో పరవశించిన తిరుమల మాడ వీధులు

తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా నాలుగో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు రుక్మిణీ సత్యభామ సమేత వేణు గోపాల స్వామి అలంకారంలో సర్వ భూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు నాలుగు మాడ వీధుల్లో వైభవంగా విహరించి భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్త బృందాల చెక్క భజనలు, జీయ్యంగార్ల గోష్టి, మంగళ వాయిద్యాల నడుమ వాహనసేవ అంగరంగ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామ స్మరణతో స్వామి వారిని దర్శించుకున్నారు.

సర్వ భూపాల అంటే సమస్త రాజులు అని అర్థం. అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, పరమేశ్వరుడు లోకాలను పరిరక్షించే శక్తులకు ప్రతీకలుగా నిలుస్తారు. వీరందరూ స్వామి వారిని తమ భుజస్కంధాలపై మోస్తూ సేవించడం ఈ వాహన సేవ ప్రత్యేకత. ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలిస్తూ, భగవంతుని ఆశీస్సులతో లోకక్షేమానికి కృషి చేయాలనే సందేశాన్ని సర్వభూపాల వాహన సేవ చాటి చెబుతోంది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం మోహినీ అవతారంలో, రాత్రి గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు భ‌క్త బాంధ‌వుల‌కు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు జానకిదేవి, నన్నపనేని సదాశివరావు, నరేష్ కుమార్, పూర్ణ సాంబశివరావు, జేఈవోలు డా. ఎ. శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!