హైదరాబాద్ : అందరూ ఊహించినట్టుగానే శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కీ రోల్ పోషించిన రణబాలి. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ తో దీనిని రూపొందించారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాకు సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ప్రేక్షకులు ప్రధాన నటీనటుల నటనను, వారి మధ్య ఉన్న కెమిస్ట్రీని మెచ్చుకోగా, మరికొందరు కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగిందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాపై భారీగా స్పందన లభిస్తోంది. విజయ్ దేవరకొండ తన తీవ్రమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు , ఇంటర్వెల్ సీక్వెన్స్కు మంచి స్పందన లభించింది.
అయితే కథ చెప్పే విధానం (నేరేషన్) ఇంకా మెరుగ్గా ఉండవచ్చని కొందరు ప్రేక్షకులు భావించారు. ఈ సినిమాకు ప్రధానంగా హైలెట్ గా నిలిచింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ చిత్రంలో రష్మిక మందన్న ‘జయమ్మ’ పాత్రలో నటించారు. ఆమె నటనను, విజయ్ దేవరకొండతో ఆమెకున్న కెమిస్ట్రీని ప్రేక్షకులు ప్రశంసించారు. ఇద్దరూ సూపర్ గా నటించారని పేర్కొన్నారు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా. సినిమా పరంగా చూస్తే ప్రధాన నటీనటుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రణబాలికి అజయ్-అతుల్ అందించిన నేపథ్య సంగీతానికి మిశ్రమ స్పందన లభించింది. కొందరికి సంగీతం నచ్చగా, మరికొందరు సినిమా రెండో భాగం నెమ్మదిగా ఉందని, నిడివి ఇంకా తక్కువగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే ఈ చిత్రం, ఆ కాలంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను, ముఖ్యంగా ‘మహా కరువు’ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది.
