కడప జిల్లా : పులివెందులలో నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వైయస్ఆర్సీపీ అభ్యర్థులు, కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. పోలీసుల తీరుకు నిరసనగా ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అక్కడే మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్యాలయానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని కడప ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్తే లాఠీ దెబ్బలు, రాళ్ల దాడులు ఎదుర్కోవాలా? ఎన్నికల సంఘం అసలు ఉన్నట్టా, లేనట్టా? అంటూ నిలదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నిస్తూ, ఎన్నికల సంఘం తక్షణమే మేల్కొని అభ్యర్థుల నామినేషన్ హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
డీఐజీ, ఎస్పీ, డీఎస్పీలను సంప్రదిస్తే మధ్యాహ్నం 1.30 గంటలకు రండి.. మీ అభ్యర్థులందరితో నామినేషన్లు వేయిస్తాం, ఎలాంటి ఇబ్బందీ ఉండదని చెప్పారు. వాళ్లు చెప్పిన మాటను నమ్మి మా అభ్యర్థులతో వస్తే, ఈరోజు వద్దు.. రేపు రండి అంటున్నారు. ఈరోజు మాకు నామినేషన్లు వేసే హక్కు ఎందుకు లేదు? పోలీసులే హామీ ఇచ్చి, మళ్లీ మాట తప్పడం ఏమిటి? మున్సిపల్ కార్యాలయం ఎదుట వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నా వారిని అడ్డుకోక పోవడం దారుణమన్నారు ఎంపీ. తాము 100 మీటర్ల దూరంలో ఉంటే మా కార్యకర్తలపై లాఠీచార్జి చేసి, టియర్ గ్యాస్ ప్రయోగిస్తారు. ఇదెక్కడి న్యాయం? అభ్యర్థులకు నామినేషన్లు వేసే హక్కును ఎందుకు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేయాలంటే లాఠీ దెబ్బలు తినాలా? టియర్ గ్యాస్ ప్రయోగాన్ని ఎదుర్కోవాలా? రాళ్ల దాడులకు గురికావాలా? ఎన్నికల సంఘం అసలు ఉన్నట్టా, లేనట్టా? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగితే ఒక్క మున్సిపాలిటీలోనైనా, ఒక్క కౌన్సిలర్ స్థానంలోనైనా గెలుస్తామనే నమ్మకం కూటమి ప్రభుత్వానికి లేదనే విధంగా ఈ పరిణామాలు కనిపిస్తున్నాయని అన్నారు ఎంపీ. ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని, నామినేషన్లు వేసే ప్రతి అభ్యర్థికి రక్షణ కల్పించాలని కోరారు.
