హైదరాబాద్ : డ్రగ్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని ప్రకటించారు డీజీపీ సీవీ ఆనంద్. ‘డ్రగ్-రహిత భారతం’ కోసం ర్యాలీని హైదరాబాద్ లో ప్రారంభించి ప్రసంగించారు. ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’లో భాగంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్ ) చేపట్టిన ఈ ర్యాలీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి , అండమాన్ నికోబార్ దీవులకు చెందిన బైక్ రైడర్లు పాల్గొంటున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వద్దద తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఈ దేశవ్యాప్త మోటార్ సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. యువతను కాపాడేందుకు అందరూ కలిసి కృషి చేయాలని డీజీపీ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న గుజరాత్లోని కేవడియాలో జరగనున్న ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ వేడుకల్లో పాల్గొనేందుకు ఈ రైడర్లు అక్కడికి ప్రయాణిస్తున్నారు.
ఈ సందర్భంగా డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. యువత మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల సరఫరాను, వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. డ్రగ్ అక్రమ రవాణాను అరికట్టడంలో తెలంగాణకు చెందిన ‘ఈగల్ ఫోర్స్’ పోషిస్తున్న పాత్రను ఆయన ప్రశంసించారు. మాదక ద్రవ్యాల వ్యాపారంలో ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జాతీయ సమైక్యతను నొక్కి చెబుతూ ఈ ర్యాలీ మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించడంతో పాటు, ‘ఏకీకృత భారతం’ అనే స్ఫూర్తిని బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతోందని పేర్కొన్నారు. ప్రయాణంలో ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రైడర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారి విక్రమ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్, పోలీసు సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు , మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
