మూడవ రాష్ట్రస్థాయి సదస్సుకు టీవీకే సన్నాహాలు
రెండు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో క్వీన్ స్వీప్
చెన్నై : తమిళనాడులో ఇప్పుడు టీవీకే పార్టీ చీఫ్, సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ హవా కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలో రెండు శాసన సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండింటిలోనూ టీవీకే అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో టీవీకే నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. ఇక ఎన్నికల విజయాన్ని పురస్కరించుకుని మూడవ రాష్ట్ర స్థాయి సదస్సుకు టీవీకే పార్టీ సన్నాహాలు చేస్తోంది. తన ఎన్నికల విజయాన్ని వేడుకగా జరుపుకోవడానికి , పార్టీని మరింత బలోపేతం చేయడానికి, వచ్చే ఏడాది ప్రారంభంలో తిరుచిరాపల్లి లేదా తిరునెల్వేలిలో మూడవ రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించాలని యోచిస్తోంది. ఈ పార్టీకి విజయ్ నాయకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా పార్టీని మరింత పటిష్టం చేయడానికి అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సదస్సు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనుందని, దీనికి విజయ సదస్సు అని పేరు పెట్టే అవకాశం ఉందని సమాచారం.
కాగా సదస్సు జరిగే వేదిక, తేదీలు లేదా పూర్తి కార్యక్రమ వివరాలను పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల జరిగిన మధురాంతకం, ధరాపురం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీవీకే విజయం సాధించిన నేపథ్యంలో ఈ సదస్సును ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫలితాలు అంతకు ముందు జరిగిన తమిళనాడు అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయంతో పాటు, పార్టీ నాయకత్వానికి మరింత ఆత్మ విశ్వాసాన్ని కల్పించాయి. తమిళ సినీ రంగంలో అగ్రశ్రేణి నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్, 2024లో టీవీకేను స్థాపించి, అదే ఏడాది విక్రవాండిలో పార్టీ మొదటి రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. ఆ సదస్సుకు భారీ సంఖ్యలో మద్దతుదారులు, ముఖ్యంగా యువత తరలి రావడంతో, రాజకీయ రంగంలోకి ఆయన ప్రవేశం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత తమిళనాడు అంతటా పార్టీని విస్తరించే ప్రయత్నంలో భాగంగా మదురైలో రెండవ రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, అద్భుతమైన రాజకీయ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు జరగబోయే మూడవ సదస్సును పార్టీ మూడవ వార్షికోత్సవం, ఎన్నికల విజయం , విజయ్ పుట్టినరోజు గా వీటన్నింటినీ కలిపి జరుపుకునే వేదికగా భావిస్తున్నారు.
