వాషింగ్టన్ : అమెరికా దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పదే పదే ప్రవాస భారతీయులపై నోరు పారేసుకుంటున్నారు. త్వరలో దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ప్రచారాన్ని మరోసారి ముందుకు తీసుకు రానున్నారు. తాజాగా హెచ్ 1బి వీసా హోల్డర్లను జేడీ వాన్స్ ఒప్పంద సేవకులు అంటూ చులకన చేసి మాట్లాడారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఎందుకంటే అమెరికాలో అత్యధికంగా ప్రవాస భారతీయులు ఉన్నారు. చాలా చోట్ల వారిదే ఆధిపత్యం. ఎన్నికల్లో గెలుపు అవకాశాలను వీరు నిర్దేశిస్తారు. విషయం గ్రహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన వ్యాఖ్యలు తీవ్రంగా తమపై దెబ్బ కొట్టే ఛాన్స్ ఉందని మాట మార్చారు. తన విమర్శ అమెరికా సంస్థలు , వీసా వ్యవస్థను ఉద్దేశించినదని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఈ వ్యవస్థ ప్రకారం, ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బి హోల్డర్లను వారి స్వదేశానికి తిరిగి పంపవచ్చు.
ఇదిలా ఉండగా జేడీ వాన్స్ తన ఒప్పంద సేవకులు అనే వ్యాఖ్య అసంపూర్ణమైనదని అంగీకరించారు. తాను అమెరికా కంపెనీలను, వీసా వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నానని, హెచ్-1బి వీసా హోల్డర్లను కాదని స్పష్టం చేశారు. హెచ్-1బి వీసా కార్మికులను ఒప్పంద సేవకులుగా జేడీ వాన్స్ అభివర్ణించడాన్ని భారతదేశ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ పదం అభ్యంతరకర మైనదిగా పేర్కొంది. చారిత్రక, వలసవాద వారసత్వ భావాలను కలిగి ఉందని మండిపడింది. నా మాటల్లో ఏమైనా లోపాలుంటే అది నా తప్పే. నేను కొందరు వీసాదారుల గురించి, కొందరు హెచ్-1బీ గురించి చెప్పింది మొత్తం వర్గానికి వర్తించదు. తరచుగా జరిగేది ఇదే వారు హెచ్-1బీ వీసాతో వచ్చినప్పుడు, ఆ పనికి తగిన ప్రత్యామ్నాయ అమెరికన్ కార్మికుడు దొరకడం లేదని కంపెనీ ధృవీకరిస్తుంది. ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్లడానికి వారి వీసానే వారికి ఉన్న ఏకైక జీవనాధారం అన్నారు జేడీ వాన్స్.
