ఓట‌ర్ల జాబితాలో పేర్ల‌ను తిరిగి చేర్చేందుకు ఓకే

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనుస‌రిస్తున్న ఒంటెద్దు పోక‌డ‌పై పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ స‌మ‌యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను తొల‌గించాల‌నే డిమాండ్ రోజు రోజుకు పెరుగ‌గుతోంది. ఈ త‌రుణంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఓటర్ల జాబితాలో పేర్లను తిరిగి చేర్చుకోవడానికి ‘ఫారమ్ 6’ను పూరించవచ్చు అని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. జాతీయ రాజధానిలో జరిగిన ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ ప్రక్రియలో తమ పేర్లను నమోదు చేయించు కోలేక పోయిన ఇద్దరు ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుండి తొలగి పోయాయి. దీనిపై వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ పేర్లను తిరిగి చేర్చాలని, అలాగే ‘ఫారమ్ 8’ ద్వారా పేర్లలో సవరణలు లేదా మార్పులు చేసుకునేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై స్పందించిన భారత ఎన్నికల సంఘం సదరు ఓటర్లు తమ సమస్య పరిష్కారం కోసం ‘ఫారమ్ 6’ను పూరించవచ్చని కోర్టుకు తెలిపింది.

పిటిషనర్లు ‘ఫారమ్ 6’ను పూరిస్తే తాము తప్పుడు సమాచారం ఇచ్చామనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని భయపడ్డారు. అయితే ఈ భయం నిరాధారమని పేర్కొన్న కోర్టు ఆ పిటిషన్‌ను ముగించింది. ఎన్నికల సంఘం తరపు న్యాయవాది ఎన్నికల నమోదు అధికారి సూచనల మేరకు ఈ విషయాన్ని తెలియ జేసినందున పిటిషనర్లకు అటువంటి ఆందోళన అవసరం లేదని కోర్టు అభిప్రాయ పడింది. ఈ వ్యాఖ్యలతో ఈ పిటిషన్‌కు సంబంధించిన విచారణ ప్రక్రియ ముగిసింది. పిటిషనర్లు కోరుకుంటే, ‘ఫారమ్ 6’ నింపవచ్చు; దీనిని చట్టప్రకారం పరిశీలిస్తాం అని జస్టిస్ దినేష్ మెహతా , జస్టిస్ అదితి చౌదరిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Leave A Reply

Your Email Id will not be published!