చెన్నై : తమిళ చలన చిత్రసీమమకు చెందిన సీనియర్ నటుడు ‘యాక్షన్ కింగ్’ అర్జున్ సర్జా ఇంట వివాహ వేడుకల సందడి నెలకొంది. ఆయన చిన్న కుమార్తె అంజన వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఆమె సుమారు 14 ఏళ్లుగా ప్రేమించిన ఇసాయి నటార్ను వివాహం చేసుకున్నారు. విదేశాల్లో హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అంజన తన వివాహానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.శాశ్వత బంధం వైపు 14 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఒక్కటైన వైనం అనే క్యాప్షన్‌తో ఆమె ఈ ఫోటోలను షేర్ చేశారు. ఈ చిత్రాల్లో అంజన లేత గులాబీ రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసి పోతుండగా ఇసాయి దానికి తగ్గట్టుగా షెర్వానీలో ఆకట్టుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.
అంజన, ఇసాయిలు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలో మొదటిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం ప్రేమగా మారి, 14 ఏళ్ల పాటు కొనసాగింది. గత ఏడాది ఇటలీలోని లేక్ కోమోలో వీరి నిశ్చితార్థం జరగగా, ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య నటిగా రాణిస్తుండగా, చిన్న కుమార్తె అంజన నటనకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ‘సర్యా వరల్డ్’ అనే సంస్థను స్థాపించి, దానికి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. కాగా అర్జున్ మరో కుమార్తె ఐశ్వర్యకు, నటుడు ఉమాపతి రామయ్యతో ఇటీవల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అంజన సోషల్ మీడియాలో పంచుకున్న వివాహ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు.
