‘కిత్తూరు రాణి చెన్నమ్మ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్’గా మారుస్తాం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన క‌ర్ణాట‌క సీఎం డీకే శివ‌కుమార్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. నార్త్‌వెస్ట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ను ఇకపై ‘కిత్తూరు రాణి చెన్నమ్మ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్’గా మారుస్తాం అని స్ప‌ష్టం చేశారు. ‘చెన్నమ్మ ఫ్రీడం పార్క్’ నిర్మాణానికి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాల‌ని ఆదేశాలు కూడా ఇస్తామ‌న్నారు సీఎం. అంతేకాకుండా శాసనసభ్యుల అభ్యర్థన మేరకు రాబోయే బడ్జెట్‌లో దీని కోసం రూ.40 కోట్ల నిధులను కేటాయిస్తాం అని వెల్ల‌డించారు. తాను నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత రైతులు ‘శ్రీ చన్నవృషభేంద్ర’ పేరుతో ఒక నీటి పారుదల ప్రాజెక్టును చేపట్టాలని కోరారు. దీనికి సంబంధించి రూ. 520 కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుందని తెలిపారు డీకే శివ‌కుమార్. ఈ ప్రాంతంలో మొత్తం సుమారు రూ. 1000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని చెప్పారు. ఇందులో 100 పడకల ఆసుపత్రి , పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా చేపట్టే రూ. 300 కోట్ల విలువైన పనులు ఉన్నాయని తెలిపారు.

కిత్తూరుకు ప్రత్యేక చరిత్ర ఉందని, కన్నడ నేల కోసం పోరాడిన ధీర వనిత రాణి చెన్నమ్మ అని కొనియాడారు సీఎం. కిత్తూరు చరిత్ర, రాణి చెన్నమ్మ జీవితం ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. రాణి చెన్నమ్మ ప్రదర్శించిన ధైర్యం ప్రతి తరానికి ఆత్మ గౌరవాన్ని నేర్పే పాఠం. కిత్తూరు వీరులకు నిలయం. ‘కిత్తూరు ఉత్సవం’ మన రాష్ట్ర గౌరవానికి చిహ్నం. చెన్నమ్మ సాహసగాథ మనందరికీ స్ఫూర్తి దాయకం, ఆమె చేసిన త్యాగం చిరస్మరణీయం. చెన్నమ్మ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు; అది ఆత్మగౌరవం, శౌర్యం , స్వేచ్ఛకు నిదర్శనం అన్నారు సీఎం.

తాము రాష్ట్రంలో ప్రశాంతమైన , అత్యుత్తమ పాలనను అందిస్తున్నామని చెప్పారు డీకే శివ‌కుమార్. ఈ ప్రాంత శాసనసభ్యులకు త‌మ‌ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మేము ఇక్కడ ఉన్న ‘సువర్ణ సౌధ’లో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించామ‌ని తెలిపారు. సమానత్వంతో కూడిన అభివృద్ధిని సాధించేందుకు, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తాము అనేక కార్యక్రమాలను రూపొందించిన‌ట్లు చెప్పారు. కర్ణాటక నేల, బసవన్న బోధించిన ‘కాయక’ (వృత్తి/పని), ‘దాసోహ’ (సేవ/దానం) , సమానత్వ సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!