హైదరాబాద్ : కోర్టులో సాక్షులు చెప్పే సాక్ష్యాలు ‘కోర్టుభాష’లో అంటే నేరం ఎప్పుడు ఎక్కడ జరిగిందనే విషయం స్థానిక భాషలో నమోదు చెయ్యాలని తెలంగాణ విశ్రాంత జిల్లా న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ మాజీ సభ్యులు మంగారి రాజేందర్ ‘జింబో’ కోరారు . తెలుగు కూటమి అంతర్జాల వేదికపై తెలుగు కూటమి అధ్యక్షులు కోదండ రామయ్య అధ్యక్షతన జరిగిన రచ్చబండ 155వ కార్యక్రమంలో మంగారి రాజేందర్ ‘జింబో’ గారు పాల్గొని మాట్లాడారు . ఈ సందర్భంగా ప్రజలకు అర్థమయేలా తాను కోర్టులో తీర్పులను తెలుగులో వెలువరించినట్లు తెలిపారు . తెలుగు భాష అమలుకు చట్టాలు ఉన్నా వాటిని అమలు చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఘోరంగా విఫలమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
కోర్టులో సాక్షులు చెప్పే సాక్ష్యాలు ‘కోర్టుభాష’లో అంటే నేరం ఎప్పుడు ఎక్కడ జరిగిందనే విషయం స్థానిక భాషలో నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ దానిని పట్టించు కోవడంలేదని విమర్శించారు. న్యాయ స్థానాలలో తెలుగు అమలుకు మనలో చిత్తశుద్దిలేదని బాంబు పేల్చారు జింబో. న్యాయమూర్తులు తెలుగులో అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపడంలేదని వాపోయారు. తీర్పులు ఆంగ్లంలో రావడం మూలంగా అది సామాన్యులకు అర్థం కాక సందిగ్దంలో పడుతున్నారని పేర్కొన్నారు విశ్రాంత న్యాయమూర్తి. హైకోర్టులో ఇంగ్లీషులోనే తీర్పులు వెల్లడించాలనే నిబంధన ఉన్నా తెలుగులో వెల్లడించ కూడదనే ఆంక్షలేవి లేవు అని అన్నారు. కనుక కోర్టుభాషలో తీర్పులు వెల్లడించడం సబబేనని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషల్లో తీర్పులు వెల్లడించేందుకు ప్రయత్నం చేస్తున్నారు కానీ, అమలు కావడం లేదన్నారు.
హైకోర్టులో ఇతర భాష న్యాయవాదులకు ఇబ్బంది అంటున్నారు కానీ, ఆధునిక పరిజ్ఞానం AIను ఉపయోగించుకొని ఆయా భాషలలో తర్జుమా చేసుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా ప్రజలు న్యాయస్థానాలలో వారికి న్యాయం జరగాలంటే భాష అవరోధంగా మారుతోందని పేర్కొన్నారు . ముద్దాయిలు ఆంగ్లభాషతో తీర్పులు రావడంతో ఆందోళనకు గురి అవుతున్నారని చెప్పారు. పక్క రాష్ట్రాలలో వారి అధికార భాషల్లో తీర్పులు వెలువడడానికి కృషి చేస్తున్నాయి కానీ, మన తెలుగు రాష్ట్రాలలో ఆ చిత్తశుద్ధి కొరవడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు మంగారి రాజేందర్.
