హైదరాబాద్ : మహిళలకు ప్రతి నెలా వచ్చే నెలసరి సమస్యపై ఈ మధ్యనే ప్రతి ఒక్కరు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇందులో సినీ హీరోయిన్లు సైతం స్పందిస్తున్నారు. తాము ఆ సమయంలో ఎదుర్కొనే మానసిక క్షోభ, ఇబ్బందులు, శారీరక ఇక్కట్ల గురించి ఏకరువు పెడుతున్నారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన మనసులోని మాటను బయట పెట్టింది. ఈ సందర్బంగా తనకు పీరియడ్స్ వచ్చే సమయంలో తన భర్త, నటుడు విజయ్ దేవరకొండ తనకు ఎలా అండగా ఉంటాడో రష్మిక వెల్లడించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకు పీరియడ్ నొప్పి వచ్చినప్పుడు విజయ్ తన పొట్టను నిమురుతూ, చేతులు ,పాదాలను సున్నితంగా నొక్కుతూ ఓదారుస్తాడని ఆమె వెల్లడించింది.
సినిమా సెట్స్‌లో పని చేస్తున్నప్పుడు తీవ్రమైన పీరియడ్ నొప్పిని ఎదుర్కోవడంలో ఉన్న సవాళ్ల గురించి కూడా రష్మిక మాట్లాడింది. కొన్నిసార్లు తన పీరియడ్స్ ప్రారంభం కాకముందే ఆందోళనకు గురవుతానని, ఆ కష్టమైన రోజుల్లో విజయ్ ఇచ్చే మద్దతును తాను ఎంతగానో అభినందిస్తున్నానని ఆమె చెప్పింది.
తన మొదటి పీరియడ్‌ను గుర్తు చేసుకుంటూ, ఏం జరుగుతుందో అర్థం కాక భయపడ్డానని రష్మిక చెప్పింది. ఆ సమయంలో తనకు శానిటరీ ప్యాడ్ల గురించి తెలియదని, వాటికి బదులుగా మడచిన టవల్స్‌ను ఉపయోగించానని ఆమె వివరించింది.
సినిమా సెట్‌లతో సహా పని ప్రదేశాలలో నెలసరి నొప్పిపై మరింత అవగాహన అవసరమని రష్మిక మందన్నా మాట్లాడారు. సరైన మద్దతు, సౌకర్యాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండక పోవడం వల్ల మహిళలు తరచుగా తీవ్రమైన అసౌకర్యంతో కూడా పని చేస్తూనే ఉంటారని ఆమె నొక్కి చెప్పారు.రష్మిక వ్యాఖ్యలు నెలసరి ఆరోగ్యం, పని ప్రదేశంలో మద్దతు, నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే అనుభవాలను అర్థం చేసుకోవడం ప్రాముఖ్యతపై ఒక చర్చను ప్రారంభించేలా చేశాయి.
