తీర‌ప్రాంత మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం

చూపించాల‌న్న ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అర్న‌బ్ తుపాను సమయంలో తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కనుగొనేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కాకినాడ జిల్లా అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగా, మత్స్యకారుల పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ‘అర్నాబ్’ తుపాను నేపథ్యంలో జిల్లా అధికారులు, తీర ప్రాంత గ్రామస్తులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. దీపావళి పండుగ తర్వాత తాను స్వయంగా మత్స్యకార గ్రామాలను సందర్శించి, వారి సమస్యలను దగ్గరగా పరిశీలిస్తానని ప్ర‌క‌టించారు ప‌వన్ క‌ళ్యాణ్‌. ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి ‘డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్’ ప్రక్రియను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు.

ఈ రక్షణ గోడను కోనపాపపేట వరకు పొడిగించే ప్రతిపాదనలను కూడా త్వరగా ఆమోదింప జేయాలని ఆయన సూచించారు. తుపాను వల్ల దెబ్బతిన్న ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డును వెంటనే పునరుద్ధరించి, తీర ప్రాంత గ్రామాలకు రవాణా సౌకర్యాన్ని పునః స్థాపించాలని ఆదేశించారు. 92 తీర ప్రాంత నివాసాల నుండి 10,000 మందికి పైగా ప్రజలను సురక్షితంగా తరలించి, 102 పునరావాస కేంద్రాల్లో వారికి వసతి కల్పించినందుకు యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. సురాడపేట, మాయాపట్నం, కొత్తపట్నం , నాయకర్ కాలనీల్లోకి చొచ్చుకొచ్చిన సముద్రపు నీరు 24 గంటల్లోనే తొలగి పోవడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోవడం, తీగలు తెగిపోవడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, వెంటనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించాలని ఆదేశించారు.

తుపాను వల్ల దెబ్బతిన్న ఇళ్లు, పంటలు, పడవలు, చేపల వలలు , చేనేత మగ్గాల నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి, పరిహారం చెల్లింపు కోసం సమగ్ర నివేదికలను సమర్పించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యాన్ని, అలాగే మత్స్యకారులు , నేత కార్మికులకు ఒక్కొక్కరికి 50 కిలోల బియ్యాన్ని, వీటితో పాటు ఇతర నిత్యావసర వస్తువులను అందించాలని ఆయన నొక్కి చెప్పారు. సహాయక చర్యలు, పునరావాసం, పునరుద్ధరణ పనులను సమర్థవంతంగా నిర్వహించినందుకు 45 ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలను, అలాగే పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఆరోగ్య , గ్రామీణాభివృద్ధి శాఖల సిబ్బందిని పవన్ కళ్యాణ్ అభినందించారు.

Leave A Reply

Your Email Id will not be published!